రోగాల బారినపడకుండా ఊరిచూట్టూ కట్టు

రోగాల బారినపడకుండా ఊరిచూట్టూ కట్టు

పోలకమ్మ పండుగ ఊరిచుట్టూ కట్టు

అలనాటి గిరిజనుల లైఫ్ స్టైల్​ను ఈ తరంలో చూడాలనుకుంటే కొలాం ఆదివాసీల పోలకమ్మ పండుగలో చూడొచ్చు. కుటుంబాల్లో సుఖశాంతులు నిండేలా పూర్వీకులు ఏమేం చేశారో... ఈ వేడుకలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. 

కొలాం ఆదివాసీలు ప్రతి యేటా మే నెలలో పోలకమ్మ పండుగ చేసుకుంటారు. మూడురోజుల పాటు చేసే ఈ పండుగ ప్రతి కొలాం గ్రామంలో వాళ్ల వాళ్ల సౌకర్యాన్ని బట్టి చేసుకుంటారు. ఆదివాసీల్లో కొలాం, గోండు తెగల సంప్రదాయలు దాదాపు దగ్గరగా ఉంటాయి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలాం గ్రామాల్లో మాత్రమే ప్రతి యేటా ఈ వేడుక చేస్తారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో కొలాంల పండుగ వేడుకలు జరుగుతున్నాయి. జైనూర్ మండలంలోని లేండిగూడ, గౌరి, జాడుగూడ, సిర్పూర్ ( యు) లోని కాకడబొడ్డి, ఖంగూడ, లింగాపూర్ మండలంలోని రుదేఖస, కొలాంగూడ, తిర్యాణి మండలంలోని దంతనపల్లి గ్రామాల్లో వేడుకలు చేశారు.

గ్రామకట్టు
గ్రామపెద్దలు నిర్ణయించిన రోజు గ్రామం చుట్టూ కట్టు గీస్తారు. పోలకమ్మ వేడుకలో ఇది ముఖ్యమైన ఆచారం. ఆ రోజు గ్రామస్తులంతా పవిత్రంగా ఉంటారు. గ్రామపెద్దలు గీసిన కట్టు గీతను దాటి ఎలాంటి దుష్ట శక్తులు, మాయదారి రోగాలు గ్రామంలోకి రావద్దని పూజ చేస్తారు. పూర్వీకులు గ్రామాన్ని ఏర్పాటుచేసినప్పటి నుంచి ఈ ఆచారం ఇలానే కొనసాగుతోందని కుల పెద్దలు చెబుతున్నారు. ఇలా చేస్తే ఏడాదిపాటు గ్రామం క్షేమంగా ఉంటుందనేది వారి నమ్మకం. తమ గ్రామాలకే కాకుండా గోండు తెగకు చెందిన ఆదివాసీ గ్రామాలకు కూడా కొలాం ఆదివాసీలు కట్టు వేస్తారు. కొలాం తెగకు అసలు పేరు పూజారి. కొలాంలు కట్టు వేసిన గోండు గ్రామాలను పూజారి కట్టు గ్రామంగా పిలుస్తారు. గ్రామాల్లో తరచుగా రోగాలు సోకుతున్నా, గ్రామాలు విడిపోయే పరిస్థితులు ఎదురైనా, ఏదైన కీడు జరిగినా కొలాం కుల పెద్దలచేత కట్టు వేయిస్తారు గోండు గ్రామాల ప్రజలు.

పందిరి దగ్గర పూజలు
రెండవ రోజు గ్రామంలో పోలకమ్మ పందిరి వేస్తారు. జొన్న, గోధుమ పిండి, పసుపు, కుంకుమతో నేల మీద ముగ్గు వేసి పచ్చని పందిరి వేస్తారు. మోదుగ, రేలా పువ్వులతో అలంకరిస్తారు . తమ తాత ముత్తాతల కాలంలో నెలకొల్పిన అమ్మవారిని కొలువుదీరుస్తారు. ఈ యేడు వ్యవసాయానికి కాలం అనుకూలించాలని, సాగు బాగుండాలని వేడుకుంటారు. గ్రామంలోని కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని దీపం వెలిగిస్తారు. మహిళలు ప్రత్యేక నైవేద్యం పెట్టి, అక్కడ వెలిగించిన దీపంతో తమ ఇండ్లలో దీపాలు వెలిగిస్తారు. పోలకమ్మ దీవెనలతో కుటుంబాల్లో ఎల్లపుడూ వెలుగులు ఉండాలని పూజచేస్తారు. కొత్త కాపురాలు కూడా ఇక్కడనుంచి లెక్కలోకి వస్తాయి.

నాటకంలో వేట
మూడవ రోజులో భాగంగా గ్రామంలో దినమంతా వేట ఆట ఆడతారు. తమ పూర్వీకులు ఆనాడు అడవిలో వేటాడిన తీరును ఆట రూపంలో నాటకంగా ప్రదర్శిస్తారు. కుల పెద్దలు ఫ్లూట్ వాయిస్తుంటే... డప్పులదరువుల మధ్య యువకులు ఆడే ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. పూర్వీకుల వేషధారణతో నిర్వహించే ఈ  ఆటలో గ్రామస్తులంతా పాల్గొంటారు. అడవికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆ ప్రదర్శనలో చూపిస్తారు. ఆ నాటకం ఇలా ఉంటుంది... దట్టమైన అడవిలో ఎంత వెతికినా ఏం దొరక్క నిరాశతో కుల దైవాన్ని  నిలదీస్తారు. ఎందుకు అడవిలో ఫలాలు తమకు దొరకడం లేదని దైవాన్ని  ప్రశ్నిస్తారు. అటవీ సంపద తమకు అందేలా వరం ఇవ్వాలని కోరుకుంటారు. భీమల్ పెన్ దీవెనతో అడవికి వెళ్తే కడుపు నింపుకొని రావాల్సిందే తప్ప... ఆకలితో చావకూడదని ఈ ఆటలో చెబుతారు. అటవీ వనరులు ఆస్వాదించే క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లతో ఏర్పడే ఇబ్బందులను కూడా ఇందులో చూపించి అడవిలో వేట ఆటను ముగిస్తారు.

ఆనాటి నుంచి వస్తున్న ఆచారం
మా ఊరికి మంచి జరగాలంటే... ఇలా చేయాలని మా తాతలు మాకు నేర్పించారు. ఈ ఆచారం వల్ల కుల దైవం దీవిస్తుందని మా నమ్మకం. అందుకే ఈ వేడుక తప్పకుండా జరుపుకుంటాం. 
- ఆత్రం ముత్తా, కొలాం

పాటిస్తేనే గుర్తింపు
సంస్కృతీ సంప్రదాయాలను పాటించినంత వరకు మాత్రమే మాకు గుర్తింపు ఉంటుంది. వాటిని మర్చిపోయిన క్షణం నుంచి గుర్తింపు కూడా తగ్గుతుంది. అందుకే  మేము ఆచరిస్తూ మా పిల్లలకు కూడా నేర్పుతున్నం.
- ఆత్రం బాపూరావు, పటేల్

::: సోయం దినకర్​ షావ్​, జైనూర్, వెలుగు 
ఫొటోలు: ఆత్రం రాజు, కొలాం లేండిగూడ