
ఆరేండ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో రివార్డ్ ప్రకటించిన పోలీసులు
9490616366, 9490616627 కు ఫోన్ చేయాలని సూచన
చేతులపై ‘మౌనిక’ ట్యాటూలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేసిన నిందితుడి కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. రేపిస్ట్ పల్లకొండ రాజు (30)ను పట్టించినోళ్లకు రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించారు. మంగళవారం అతడి ఫొటోతో పాటు రివార్డుకు సంబంధించిన ప్రకటనను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. నిందితుడు 5.9 అడుగుల ఎత్తుంటాడని, రెండు చేతులపై మౌనిక అనే పేరు ట్యాటూ ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పొడవాటి జుట్టుకి రబ్బర్ బ్యాండ్ వేసుకుని ఉంటాడని చెప్పారు.
నెత్తిమీద టోపీ పెట్టుకోవడంతో పాటు మెడకు ఎరుపు రంగు స్కార్ఫ్‌ను కట్టుకున్నాడని, ఫార్మల్ ప్యాంట్, షర్ట్ వేసుకున్నాడని అందులో పేర్కొన్నారు. బస్టాండ్ లేదా ఫుట్‌పాత్‌లపైనే ఉండే అవకాశముందని, అతడి గురించి తెలిసినోళ్లు ఈస్ట్‌జోన్ డీసీపీకి 9490616366 నంబర్‌లోగానీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీకి 94a90616627 నంబర్లో గానీ సమాచారం ఇవ్వొచ్చని సూచించారు. అంతకుముందు జాయింట్ సీపీలు, డీసీపీలతో సీపీ అంజనీ కుమార్ సమీక్ష చేశారు. టాస్క్‌ఫోర్స్, ఎస్బీ, ఐటీ వింగ్ అధికారులతో టీమ్‌ను ఏర్పాటు చేశారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు
రాజును పట్టుకునేందుకు 10 స్పెషల్ టీమ్స్‌కు చెందిన వంద మంది పోలీసులు గాలింపు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి కదలికలను తెలుసుకుంటున్నారు. ఘటన జరిగిన తర్వాత సింగరేణి కాలనీ నుంచి సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తిరిగినట్టు సీసీటీవీల ద్వారా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఓ డాక్టర్ ఇంట్లో రాజు పనిచేసినట్టు తెలుస్తోంది. వచ్చిన కూలీ డబ్బులతో అతడు మద్యం తాగినట్టు తేల్చారు. ఆ తరువాత ఎల్బీనగర్, ఉప్పల్ వరకు వెళ్లినట్టు సీసీటీవీలో గుర్తించారు. అడ్డగూడూరులో ఉంటున్న రాజు తల్లిని, సూర్యాపేట జిల్లా జలాల్పూర్లో ఉంటున్న భార్యను పోలీసులు విచారించారు. రాజు వేధింపులు తట్టుకోలేక వాళ్లిద్దరూ దూరంగా ఉంటున్నట్టు నిర్ధారించారు.