పోలీసుల అదుపులో రాజగోపాల్ రెడ్డి

పోలీసుల అదుపులో రాజగోపాల్ రెడ్డి

గొల్ల కురుమల కోసం పోరుబాట పట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గొల్లకురుమలను మోసం చేసిందంటూ బీజేపీ ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం గొల్లకురుమల బ్యాంకు ఖాతాల్లో జమచేసిన డబ్బులను వెనక్కి తీసుకుందంటూ ఆరోపించారు. 

ధర్నాలో గొల్ల కురుమలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ధర్నా చేస్తున్న  రాజగోపాల్ రెడ్డిని తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. బీజేపీ కార్యకర్తలు, గొల్ల కురుమలు రాజగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా.. పోలీసుల కార్ల ముందు బైఠాయించే ప్రయత్నం చేశారు. తోపులాట, ఉద్రిక్తల మధ్య రాజగోపాల్ రెడ్డిని మునుగోడు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

4 లక్షల మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తాం

మునుగోడు ఎన్నికలో గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేశారో  అందరికీ తెలుసని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గొల్లకురుమ సోదరులను మోసం చేసినందుకు పోరుబాట మొదలు పెట్టామని చెప్పారు. గొల్ల కురుమ సోదరులకు గొర్ల కోసం డబ్బులు ఇస్తున్నామని.. 7,540 మంది అకౌంట్‭లో డబ్బులు వేశారని గుర్తుచేశారు. అయితే అకౌంట్‭లో డబ్బులు వేసినట్టే వేసి ఫ్రీజ్ చేశారని ఆరోపించారు. గొల్ల కురుమ సోదరుల అనుమతి లేకుండా అకౌంటు ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు.  ఫ్రీజ్ చేసిన మొత్తం డబ్బులను విడుదల చేయాలని పోరుబాట ద్వారా డిమాండ్ చేస్తున్నామని రాజగోపాల్ రెడ్డి అన్నారు. డబ్బులు విడుదల చేయకపోతే  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  నాలుగు లక్షల మందితో.. ప్రగతి భవన్‭ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే.. దళితబంధు హామీ ఇచ్చేంతవరకు తమ పోరు ఆగదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.