
- దంపతుల మధ్య వివాహేతర సంబంధాలతో అఘాయిత్యం
- ప్రియుడు, తమ్ముడితో కలిసి హత్య చేయించిన భార్య
- ముగ్గురు నిందితులు అరెస్ట్.. పరారీలో మరొకరు
- భువనగిరి డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ వెల్లడి
యాదాద్రి, వెలుగు: వివాహేతర సంబంధాల కారణంగా భర్తను కారుతో ఢీకొట్టి చంపించిన ఘటనలో ముగ్గురు నిందితులను యాదాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్‌చేశారు. భువనగిరి డీసీపీ ఆకాంక్ష్యాదవ్మంగళవారం మీడియాకు వివరాలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామి(38), స్వాతి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మోత్కూరులోని ఓ ట్రాక్టర్షోరూమ్లో స్వామి మేనేజర్ గా చేస్తున్నాడు. 2017లో భువనగిరిలోని ఓ మోటార్ షోరూమ్‌లో స్వాతి జాబ్ చేస్తుండగా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన గుంటి సాయికుమార్‌తో పరిచయమైంది. ఆ షోరూమ్మూసివేయడంతో స్వాతి తన భర్త చేసే షోరూమ్ లో జాబ్ లో చేరింది.
కాగా.. గతేడాది ఫిబ్రవరిలో మోత్కూరులో సాయికుమార్‌కు స్వాతి కనిపించింది. దీంతో మళ్లీ వీరి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారి తీసింది. అదేవిధంగా స్వామి తన బావమరిది పొట్టెపాక మహేశ్మొదటి భార్య సవితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడం ఇటీవల బయటపడింది. దీంతో మహేశ్ తన అక్క స్వాతికి చెప్పడంతో ఇంట్లో గొడవలు తలెత్తాయి. సవితకు దూరంగా ఉండాలని భర్తను స్వాతి హెచ్చరించగా, మూడు నెలలుగా ఆమెను స్వామి వేధిస్తున్నాడు. ప్రియుడు సాయికుమార్, తమ్ముడు మహేశ్‌తో కలిసి భర్తను చంపాలని ఆమె ప్లాన్ చేసింది. ఈనెల13న స్వామి పనిమీద భువనగిరికి వెళ్లడాన్ని ప్రియుడికి తెలిపింది.
అతడు తన ఫ్రెండ్ చీమల రామలింగస్వామితో కలిసి పవన్‌కు చెందిన కారును అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు పని పూర్తయ్యాక స్వామి తన ఫ్రెండ్ వీరబాబుతో కలిసి బైక్ పై సొంతూరికి వెళ్తున్నాడు. మోటకొండూరు మండలం కాటేపల్లి బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి కారుతో స్పీడ్ గా ఢీకొట్టడంతో స్వామి స్పాట్ లో చనిపోగా, వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వెళ్లి వీరబాబును భువనగిరిలోని జిల్లా ఆస్పత్రికి, అక్కడినుంచి మెరుగైన వైద్యానికి గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మృతుడు స్వామి బాబాయి అయిలయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు ఓనర్ పవన్, డ్రైవర్ గుంటి అనిల్‌కుమార్‌ను విచారించగా స్వామిది యాక్సిడెంట్ కాదని, ఢీకొట్టి చంపినట్టు ఒప్పుకున్నారు. గుంటి సాయికుమార్, స్వాతి, మహేశ్‌ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రామలింగస్వామి పరారీలో ఉన్నాడు. 24 గంటల్లో కేసును ఛేదించిన ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, సీఐ శంకర్, ఎస్‌హెచ్‌వో ఉపేందర్ ను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, యాదాద్రి డీసీపీ ఆకాంక్ష్‌యాదవ్ అభినందించారు.