ఫేక్ బర్త్, డెత్​ సర్టిఫికెట్ల దందాపై డీటెయిల్స్ ఇవ్వండి..GHMCని కోరిన పోలీసులు

ఫేక్ బర్త్, డెత్​ సర్టిఫికెట్ల దందాపై డీటెయిల్స్ ఇవ్వండి..GHMCని కోరిన పోలీసులు
  • 300 మీ సేవ కేంద్రాలపై కేసులు నమోదు
  • మునుపటిలా ఏఎంఓహెచ్​ల ద్వారా కొత్త సర్టిఫికెట్లు జారీ

హైదరాబాద్, వెలుగు:ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 300 మీసేవ కేంద్రాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 950 మీసేవ కేంద్రాల నుంచి ఫేక్​సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించగా, వాటి నిర్వాహకులపై కేసులు ఫైల్ చేయాలని రెండు నెలల కిందటే జీహెచ్ఎంసీ కమిషనర్ ​మెడికల్​ ఆఫీసర్లు, ఏఎంసీలను ఆదేశించారు. అయితే ఇప్పటికీ చాలా మంది ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అందిన ఫిర్యాదుల వరకు పోలీసులు విచారణ చేపట్టారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పూర్తి వివరాలు అందజేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. ఫేక్​సర్టిఫికెట్లు పొందిన వారి వివరాలు, మీసేవల ఫోన్​నంబర్లను తీసుకుంటున్నారు. ఫేక్​సర్టిఫికెట్లు ఎందుకు జారీ చేశారో.. పొందినవారు వాటితో ఏమి చేశారనే విషయాలు తేలాల్సి ఉంది. మొత్తం 22,984 వేల మందికి సంబంధించిన సర్టిఫికెట్లను ఆర్డీఓ ప్రొసీడింగ్స్​లేకుండానే మీసేవ నిర్వాహకులు అప్ లోడ్ చేయగా ఇందులో 21,085 బర్త్, 1,869 డెత్ సర్టిఫికెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. 

మళ్లీ అప్లయ్ చేసుకుంటున్నరు

రద్దు చేసిన 22 వేల సర్టిఫికెట్లను తిరిగి పొందాలంటే మరోసారి అప్లయ్ చేసుకోవాలని బల్దియా అధికారులు ప్రకటించారు. ప్రతిఒక్క దరఖాస్తు దారుడికి  ఫోన్​ద్వారా సమాచారం అందించారు. అయితే రిజెక్ట్ అయిన సర్టిఫికెట్లన్నీ నాన్​అవేలబిలిటీ(ఎన్ఏ) కింద వచ్చిన దరఖాస్తుదారులవే ఉన్నాయి. పుట్టిన, మరణించిన ఏడాది తర్వాత సర్టిఫికెట్లు కావాలంటే ఎన్ఏ కింద అప్లయ్​చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆర్డీఓ ప్రొసీడింగ్స్ తీసుకొని బర్త్ లేదా డెత్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. ఇటీవల రద్దయిన సర్టిఫికెట్ల కోసం తిరిగి అప్లయ్​చేసుకుంటున్నారు. అధికారులు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి జారీ చేస్తున్నారు.

తిరిగి వాళ్లకే బాధ్యతలు

ఫేక్ బర్త్, డెత్ సర్టిఫికెట్ల దందా బయటపడడంతో మీ సేవలకు ఉన్న బాధ్యతలను పూర్తిగా తొలగించారు. గతంలో మాదిరిగా ఏఎంఓహెచ్(అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఫర్ హెల్త్)లకు జారీ బాధ్యతలు అప్పగించారు. హాస్పిటల్స్​లో పుట్టిన, చనిపోయినవారికి మాత్రమే ఎలాంటి విచారణ లేకుండా మీసేవ నుంచి సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇండ్లలో పుట్టిన లేదా మరణించిన వారితోపాటు ఏడాది తర్వాత నాన్ అవేలబిలిటీ(ఎన్​ఏ) కింద దరఖాస్తు చేసుకుంటున్న వారి అప్లికేషన్లను పూర్తి విచారణ జరిపాకే ఏఎంఓహెచ్ లు అప్రూవల్ ఇస్తున్నారు. ఈ మేరకు సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు.