
- అడ్డుకున్న పీటీఐ కార్యకర్తలపై లాఠీచార్జ్
ఇస్లామాబాద్: తోషాఖానా కేసులో ఇస్లామాబాద్‌లో కోర్టు విచారణకు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బయల్దేరిన వెంటనే లాహోర్‌లోని ఆయన ఇంట్లోకి పోలీసులు ప్రవేశించారు. బారికేడ్లను దాటుకుని, అడ్డొచ్చిన పీటీఐ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి మరీ లోనికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఇమ్రాన్ భార్య బుష్రా బేగమ్ ఒక్కరే ఉన్నారు. ఈ ఆపరేషన్ సమయంలో 10 మంది పీటీఐ కార్యకర్తలకు గాయాలయ్యాయి. 30 మందికి పైగా అరెస్టయ్యారు. ఇమ్రాన్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను పీటీఐ ట్వీట్ చేసింది. కార్యకర్తలను పోలీసులు కొడుతుండటం అందులో కనిపించింది. ‘‘జమాన్ పార్క్‌లోని ఇంట్లో బుష్రా బేగం ఒంటరిగా ఉన్న టైంలో పంజాబ్ పోలీసులు దాడికి పాల్పడ్డారు. వారు ఏ చట్టం ప్రకారం ఇలా చేస్తున్నారు? పరారీలో ఉన్న నవాజ్ షరీఫ్‌ను అధికారంలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్లాన్‌లో ఇదో భాగం” అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.