బండి ఆపలేదని డ్రైవర్‌ను చితక్కొట్టిన పోలీసులు

బండి ఆపలేదని డ్రైవర్‌ను చితక్కొట్టిన పోలీసులు

వాహనాల చెకింగ్ సమయంలో బండిని ఆపమంటే ఆపలేదని డ్రైవర్‌ను పోలీసులు చితక్కొట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. ఆపమన్న వెంటనే వాహనం ఆపలేదన్న కోపంతో పోలీసులు డ్రైవర్‌ను చితకబాదారు. దాంతో బాధితుడు కుప్పకూలిపోయాడు. తాము చెప్పిన చోట కాకుండా కాస్త ముందుకు వెళ్లి వాహనాన్ని ఆపాడన్న ఆక్రోశంతో పోలీసులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. బాధితుడు తనను వదిలేయాలని వేడుకుంటున్నా పట్టించుకోకుండా బూటు కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్నారు. ఈ తతంగాన్ని వాహనదారులు వీడియో తీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

మంగళవారం ఉదయం సదాశివపేట అయ్యప్ప స్వామి గుడి వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సదాశివపేటకు చెందిన వాజిద్ తన బొలెరో వాహనంతో కిరాయికి వెళ్తున్నాడు. వేగంగా వెళ్తున్న సమయంలో పోలీసులు సడెన్‌గా బండిని ఆపాలని సూచించడంతో.. వాజిద్ బండిని కాస్త ముందుకు వెళ్లి ఆపాడు. దాంతో ఆగ్రహించిన కానిస్టేబుళ్లు లాఠీతో వాజిద్‌ను తీవ్రంగా కొట్టారు. తాను ఏ నేరం చేయలేదని, వదిలిపెట్టాలని వాజిద్ వేడుకుంటుండగా మరింత రెచ్చిపోయిన కానిస్టేబుళ్లు.. బూటుకాలితో అతడిని తన్నుతూ దుర్భాషలాడారు.
 
ఈ ఘటనలో వాజిద్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు.. గాయాలతో బాధపడుతున్న వాజిద్‌‌ను చేతులతో ఎత్తుకుని సదాశివపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. వాజిద్‌పై దాడికి పాల్పడిన పోలీసులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వమేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటుంది.. కానీ పోలీసులు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలతో సఖ్యతగా నడుచుకోవాలని ఉన్నతాధికారులు చెబుతున్నా.. కిందిస్థాయి పోలీసులు మాత్రం అతి చేస్తున్నారని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.