భారత్‌పై పాక్ గెలుపుతో పలుచోట్ల సంబురాలు.. కొందరి అరెస్టు

భారత్‌పై పాక్ గెలుపుతో పలుచోట్ల సంబురాలు.. కొందరి అరెస్టు

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచ కప్‌లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ ముగిసి నాల్రోజులు అయినా వివాదాలు మాత్రం ఆగడం లేదు. అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ఈ మ్యాచ్‌లో ఇండియాపై పాక్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. కానీ మన దేశంలో పలుచోట్ల పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. భారత్ ఓటమిని, పాక్ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న పలు ఘటనల్లో కొందరు అరెస్ట్ అయ్యారు. రీసెంట్‌గా ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో పాకిస్థాన్ గెలుపు తర్వాత సంబురాలు చేసుకున్న ముగ్గురు కశ్మీరీ స్టూడెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం ట్వీట్ చేసింది. 

పాక్‌ను పొగుడుతూ అమ్మాయిల డ్యాన్సులు

కశ్మీర్ మెడికల్ స్టూడెంట్స్ సంబురాలు చేసుకోవడంపై యాంటీ టెర్రర్ లా (ఉపా చట్టం) కింద కేసు నమోదయ్యాయి. శ్రీనగర్ లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (జీఎంసీ) వుమెన్స్ హాస్టల్, షేర్ కశ్మీర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్కిమ్స్) కాలేజీల్లో స్టూడెంట్స్ పాక్ గెలుపుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ డాన్సులు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కొంత మంది అమ్మాయిలు పాక్ ను పొడుగుతూ నినాదాలు చేశారు. దీంతో వాళ్లపై కరణ్ నగర్, సౌరా పోలీస్ స్టేషన్లలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.

సెలబ్రేట్ చేసుకున్నందుకు టీచర్‌పై సస్పెండ్

రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని నీర్జా మోడీ ప్రైవేట్ స్కూల్ లో పని చేసే నఫీసా అట్టారీ అనే టీచర్ ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ టీమ్ విజయం సాధించడంపై సంబురంగా ఫీల్ అయింది. దీంతో ‘వుయ్ వన్ (మనం గెలిచాం)’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంది. పాకిస్థాన్ ప్లేయర్ల ఫొటోలను కూడా స్టేటస్ లో పెట్టింది. ఆమె పెట్టిన వాట్సాప్ స్టేటస్ ను స్కూల్ లో పని చేసే ఇతర టీచర్లు, స్టూడెంట్స్ తల్లిదండ్రులు స్క్రీన్ షాట్స్ తీసి స్కూల్ మేనేజ్మెంట్ కు పంపారు. దీంతో నఫీసాను  పిలిచి, ‘మీరు పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా ఆమె అవునని సమాధానం ఇచ్చారని స్కూల్ మేనేజ్మెంట్ చెబుతోంది. దీంతో ఆమెను జాబ్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.

వాళ్లలో భారత్ డీఎన్‌ఏ కాదు

ఇండియా మీద పాకిస్థాన్ గెలిచిన తర్వాత సెలబ్రేట్ చేసుకున్న ఘటనలపై క్రికెటర్లు, రాజకీయ నేతలు ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్ విజయం సాధించడంపై మన దేశంలో సంబురాలు జరుపుకున్న వాళ్లు ఇండియన్స్ కాదంటూ హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ అన్నారు. భారత్ లో ఉంటూ పాక్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్న వాళ్లలో ఉన్నది ఇండియా డీఎన్ఏ కాదని అభిప్రాయపడ్డారు. మన దేశంలోనే మన మధ్యనే తిరుగుతున్న ఇలాంటి దేశద్రోహుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

అసలు వాళ్లు ఇండియన్సే కాదు

పాక్ గెలిచినందుకు క్రాకర్స్ కాల్చేవారు అసలు భారతీయులు కారని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. ఇది సిగ్గుచేటని.. ఓడిన మన ప్లేయర్లు, టీమ్‌కు మనం మద్దతుగా నిలవాల్సిన సమయం ఇదన్నాడు. ఏ అంశం పై అయినా సరదాగా స్పందించే డాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ విషయం మీద కూడా ఫన్నీగా ట్వీట్ చేశారు. ‘దీపావళి పండుగ సమయంలో ఫైర్‌క్రాకర్స్‌పై నిషేధం విధిస్తారు. కానీ పాక్ గెలుపు తర్వాత భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో టపాసులు కాల్చి సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్లు క్రికెట్ గెలుపును సెలబ్రేట్ చేసుకున్నారేమో. అలాంటప్పుడు దివాళీకి ఫైర్‌క్రాకర్స్‌ను కాల్చడంలో తప్పేముంది?’ అని వీరూ ప్రశ్నించాడు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. భారత్‌పై పాక్ గెలుపు తర్వాత ఇరు దేశాల సీనియర్ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా టర్భనేటర్ హర్భజన్ సింగ్, పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ మధ్య ట్విట్టర్ వార్ చర్చనీయాంశం అయ్యింది.

మరిన్ని వార్తల కోసం: 

టీటీడీ బోర్డులోని 18 మందికి హైకోర్టు నోటీసులు

మోడీని ఓడించినా.. బీజేపీని ఏమీ చేయలేరు

ముగ్గురు మృతి: ఏడు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ