Uttar Pradesh: ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో మరో నిందితుడి ఎన్‌కౌంటర్‌

Uttar Pradesh: ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో మరో నిందితుడి ఎన్‌కౌంటర్‌

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో సంచలనం రేపిన ఉమేశ్‌ పాల్‌ (Umesh Pal) హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. మార్చి 6వ తేదీ తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌లోని కౌంధియారా పోలీస్ స్టేషన్‌లో నిందితుడు విజయ్‌ అలియాస్‌ ఉస్మాన్‌ను ఎన్‌కౌంటర్‌ లో కాల్చి చంపినట్లు అక్కడి పోలీసులు చెప్పారు. ఉమేశ్‌ పాల్‌పై కాల్పులు జరిపిన ఆరుగురు షార్ప్‌ షూటర్లలో ఉస్మాన్‌ ఒక నిందితుడు. ఈయనే నేరుగా ఉమేశ్‌ పాల్ ను కాల్చాడని వెల్లడించారు. మరోవైపు.. ఇదే కేసులో మరో నిందితుడు అర్బాజ్‌ను ఫిబ్రవరి 27వ తేదీన పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే.

2005 నాటి బీఎస్పీ (BSP) శాసనసభ్యుడు రాజుపాల్‌ (Raju Pal) హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉమేశ్‌ పాల్‌ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన హత్యకు గురయ్యారు. గత వారం ఉమేశ్ పాల్ తో పాటు ఆయన బాడీగార్డ్స్ ను కూడా నడిరోడ్డుపై కాల్చిచంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉమేశ్‌ పాల్‌ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. ఉమేశ్ పాల్ భార్య జయ పాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్ (Atiq Ahmed), అతడి సోదరుడు అష్రఫ్‌, భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు అనుచరులు, మరో తొమ్మది మందిపై కేసులు నమోదు చేశారు.

2004లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో రాజు పాల్‌ అలహాబాద్‌ (పశ్చిమ) స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అతీక్‌ అహ్మద్‌ తమ్ముడు ఖలీద్‌ అజిమ్‌పై విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన కొన్ని నెలలకే రాజు పాల్‌ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ ప్రస్తుతం గుజరాత్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. రాజుపాల్‌ హత్య కేసులో ఉమేశ్ పాల్‌ ప్రధాన సాక్షిగా ఉన్నారు. అయితే గతంలో ఉమేశ్‌ పాల్‌ను అతీక్‌ అహ్మద్ అనుచరులు ఓసారి కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఇటీవల ఉమేశ్‌ను అతడి ఇంటి వద్దే దారుణంగా హత్య చేయడం దుమారం రేపింది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న యోగి ఆదిత్యనాథ్ (UP) ప్రభుత్వం.. ఈ మధ్యే అతీక్‌ అహ్మద్ అనుచరుడి ఇంటిని కూల్చివేయించింది.