
వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వైశాలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన కారు లభ్యమైంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నిందితుడు నవీన్ రెడ్డి కారును గుర్తించారు. కారు రెండు రోజులుగా పొలాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిందితుడు నవీన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి పై గతంలో పలు కేసులు ఉన్నట్లు గుర్తించారు. 2019లో నవీన్ రెడ్డి పై చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు సమాచారం. అలాగే.. నిందితుడి పై రోడ్డు యాక్సిడెంట్ కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు రోజుల క్రితం.. దామోదర్ రెడ్డి కూతురు వైశాలిని మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 100 మందికిపైగా యువకులతో.. దామోదర్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను బెదిరించి ఆమెను ఎత్తుకెళ్లారు. ఇంట్లోని సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని నవీన్ తో వచ్చిన మనుషులు ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చారు. ప్రస్తుతం ఓయో హోటల్లో బస చేసి నిందితుడు నవీన్ రెడ్డి బెజవాడ పారిపోయినట్లు సమాచారం. మరోవైపు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.