పోలీసుల ఎంక్వైరీ ముందుకు సాగుతలేదు

పోలీసుల ఎంక్వైరీ ముందుకు సాగుతలేదు
  • ఫిర్యాదు చేసి నెల రోజులైనా అరెస్టుల్లేవ్
  • నిందితులను ఇలా పట్టుకుని.. అలా వదిలేశారు
  • పక్కదారి పట్టించేందుకే డిలే చేస్తున్నారని అనుమానం

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసుల ఎంక్వైరీ ముందుకు సాగడం లేదు. టేకులపల్లిలో ఇండ్లు, బ్యాంకు లోన్లు ఇప్పిస్తామంటూ   డబ్బులు వసూలు చేశారని బాధితులు జులై 1న ఖానాపురం హవేలి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కంప్లైంట్​చేసి నెల రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు  ప్రధాన నిందితులు  షాహీన్​, లక్ష్మిలను  అరెస్ట్ చేయకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారిని అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించకుండానే వదిలిపెట్టారని చెప్తున్నారు. పోలీసులు మాత్రం నోటీసులు ఇచ్చామని, అవసరమైతే ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామంటున్నారు.  

200 మంది నుంచి రూ. 3 కోట్లు వసూలు

దాదాపు ఏడాది నుంచి ఖమ్మంలో ఈ దందా జరుగుతోందని  బాధితులు చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల కోసం మధ్యవర్తుల ద్వారా ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేశారు.  దాదాపు 200 మంది నుంచి సుమారు రూ.3 కోట్ల వరకు వసూలు చేశారని తెలుస్తోంది. ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఆరుగురు తమ కమిషన్​ తీసుకుని మిగతా డబ్బులు  ప్రధాన నిందితులకు ఇచ్చినట్టు చెబుతున్నారు. బ్యాంకుల నుంచి లోన్‌‌‌‌లు ఇప్పిస్తామని రూ.5 లక్షల లోన్​ కోసం రూ.1లక్ష, 10 లక్షల లోన్​ కోసం రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారు. కొంతమందికి డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు మంజూరు అయినట్టుగా ఫేక్​ పట్టాలు కూడా ఇచ్చారు. ఏడాదయినా ఇండ్లు రాకపోవడంతో బాధితులు మంత్రి పువ్వాడ అజయ్​ను కలిసి ఫిర్యాదు చేయగా..  పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆయన అర్బన్​ పోలీసులను ఆదేశించారు. విచారణలో జాప్యాన్ని  ప్రధాన నిందితులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. వారు బాధితులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు.  నెల రోజుల్లో మూడు చోట్ల నిందితులు బాధితులతో మీటింగులు పెట్టినట్టు తెలుస్తోంది. గట్టిగా అడిగిన వారికి డబ్బులు వాపసు ఇస్తామని.. మిగిలిన వారికి కొంత ఆలస్యమైనా  డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నట్టు సమాచారం. దీంతో కొందరు బాధితులు మెత్తబడినట్టు తెలుస్తోంది. కేసులు చుట్టూ తిరగడంకన్నా  వెయిట్ చేస్తే డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు వస్తాయని ఆశ పడుతున్నారు.  కాగా మరికొందరు బాధితుల మీద కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. 

హమాలీ పని చేసి రూ.లక్షన్నర కట్టా

నేను గాంధీ చౌక్​ లో హమాలీ పని చేస్తుంటా. డబుల్ బెడ్రూమ్​ ఇల్లు వస్తుందన్న మధ్యవర్తి మాటలు నమ్మి, ఇన్నేళ్లు కష్టపడిన సొమ్ము రూ. లక్షన్నర కట్టాను. ఏడాది నుంచి అడుగుతుంటే ఇగో వస్తది అంటూ ఆలస్యం చేశారు. ఇప్పుడు అడిగితే తొందరలో నీ డబ్బులు నీకిస్తాం, గొడవ చేయొద్దు అంటున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేసి మా లాంటి వాళ్లకు న్యాయం చేయాలి. 

-  భాస్కర్​, సారథినగర్​, ఖమ్మం

ఎంక్వైరీ చేస్తున్నాం

బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేస్తున్నాం.  దాదాపు 100 మంది బాధితులు రూ.1 కోటి వరకు నిందితులకు ఇచ్చినట్టు తేలింది.  అంతా క్యాష్ రూపంలో లావాదేవీలు చేశారు. బాధితులు, నిందితులు చెబుతున్న లెక్కల్లో తేడాలున్నాయి. వసూలు చేసిన డబ్బులతో ఏం చేశారనే దానిపై ఎంక్వైరీ చేస్తున్నాం. నిందితులకు నోటీసులు ఇచ్చాం. పరిస్థితిని బట్టి అరెస్ట్ చేస్తాం. 

- రామకృష్ణ,  ఖానాపురం హవేలి సీఐ​