నిందితులు చేసే తప్పుడు ప్రచారం నమ్మొద్దు : పోలీసులు

నిందితులు చేసే తప్పుడు ప్రచారం నమ్మొద్దు : పోలీసులు

హైదరాబాద్ : మల్టీ లెవెల్ స్కీమ్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో వేలమందిని మోసం చేసి.. రూ.కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు, పలు కేసుల్లో పరారీలో ఉన్న నిందితుడు గార్దాస్ రమేశ్.. ఉద్దేశపూర్వకంగా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని .. వాటిని మీడియా సహా ఎవరూ నమ్మొద్దని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కోరింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్.. ఓ మీడియా ప్రకటన విడుదల చేశారు.

కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన గార్దాస్ రమేశ్(47).. సికింద్రాబాద్- బోయిన్ పల్లిలోని ఘోరీనగర్ లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తాడు. ఆ తర్వాత.. వైట్ కాలర్ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. క్రిప్టో కరెన్సీ/బిట్ కాయిన్ ట్రేడింగ్ బిజినెస్ పేరుతో…. అమాయకులను మోసం చేశాడంటూ అతడిపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి… 1200 మంది కస్టమర్లను ఆకర్షించి… రూ.10కోట్లకు వారిని ముంచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాను చేసిన మోసాలను ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై పరువు నష్టం దావా వేయడం.. వారిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు కూడా గార్దాస్ రమేశ్ పై ఉన్నాయి.

15 కేసుల్లో నిందితుడిగా ఉన్న గార్దాస్ రమేశ్ ను.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 2018 ఆగస్ట్ 24న అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీకోసం రిమాండ్ కు పంపించారు. అతడి ముఠా నుంచి.. 30లక్షల క్యాష్, రియల్ ఎస్టేట్ ల్యాండ్ డాక్యుమెంట్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్, స్వైపింగ్ మెషీన్లు, కార్లు, సెల్ ఫోన్లు, చెక్ బుక్ లు, ఏటీఎం కార్డులు సీజ్ చేశారు.

ఐతే… గార్దాస్ రమేశ్ పరారీలో ఉంటూ.. తమ కళ్లుగప్పి తిరుగుతున్నాడని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారు.  క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ కాకుండా ఉండేందుకు.. పోలీసులపైనే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నాడని చెప్పారు. మీడియా కానీ.. మరే ఇతర సంస్థలు, వ్యక్తులు గార్దాస్ రమేశ్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు చెప్పారు.

అతడిపై నమోదైన కేసుల వివరాలను ప్రకటించారు.