
- నివాళులర్పించిన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు
వెలుగు, నెట్వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని (ఫ్లాగ్ డే) నిర్వహించారు. హనుమకొండలోని కమిషనరేట్ అమరవీరుల స్తూపం వద్ద వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, స్నేహా శబరీశ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్, ఎన్‍పీడీసీఎల్ సీఎండీ వరుణ్‍రెడ్డి నివాళులు అర్పించారు.
అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ ఆఫీస్‌లో అమరుల స్తూపం వద్ద ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు. ములుగు జిల్లాలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో అమర పోలీసులకు నివాళులర్పించారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలోని తెలంగాణ స్పెషల్ పోలీస్ 5వ బెటాలియన్ లో ఫ్లాగ్ డే నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్అమరుల స్తూపం వద్ద ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఆధ్వర్యంలో నివాళులర్పించగా, హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం నాగారానికి చెందిన అమరుడు గ్రేహౌండ్స్ జూనియర్ కమాండర్ పెరుగు రవి విగ్రహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నివాళులర్పించారు.
జనగామ జిల్లా రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అమరులకు నివాళులర్పించారు. అనంతరం గడిచిన ఏడాదిలో విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల పేర్లు చదివి వినిపించారు. 'శోక్ శ్రస్త్' చేసి మరణించిన అమరవీరులకు మౌనం పాటించారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు గిప్ట్‌లు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ పోలీస్ అమరుల త్యాగాలు నిరస్మరణీయమన్నారు. పోలీసులకు ప్రజల్లో మంచిపేరు సంపాదించాలంటే విధుల్లో చిత్తశుద్ధి, నీతినిజాయతీతో పనిచేయాలన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత శాఖమీదే ఉందని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా పూర్తి సహకారం అందిస్తామన్నారు.