
- వ్యాపారుల ఇండ్లలో పోలీసుల సోదాలు.. ఆరుగురిపై కేసు
- 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు స్వాధీనం
ఖమ్మం టౌన్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న పలువురి ఇండ్లలో సోమవారం సోదాలు నిర్వహించినట్లు ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. ఏకకాలంలో 11 చోట్ల దాడులు చేశామన్నారు. లక్షల విలువ చేసే 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు లభ్యమయ్యాయని తెలిపారు.
చిట్ నిర్వాహకులు తమ కస్టమర్ల నుంచి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం లాంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో ఈ దాడులు చేపట్టామన్నారు. వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసి ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.