బీజేపీ ఆఫీసులోని భరత మాత విగ్రహం తొలగింపు.. బలవంతంగా ఎందుకు..?

బీజేపీ ఆఫీసులోని భరత మాత విగ్రహం తొలగింపు.. బలవంతంగా ఎందుకు..?

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన భరతమాత విగ్రహాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులుతొలగించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై 'ఎన్మన్, ఎన్మక్కల్' పాదయాత్ర సందర్భంగా ఆగస్ట్ 9,11 మధ్య విరుదునగర్‌లో పర్యటించనున్నారు. ఈ క్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులు నల్లరాతితో చేసిన భారత మాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. కాగా తాజాగా ఈ విగ్రహాన్ని అధికారులు తొలగించడాన్ని పార్టీ తీవ్రంగా ఖండించింది.

ముందస్తు అనుమతి తీసుకోకుండానే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, హైకోర్టు ఆదేశాలకు, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు ఇది విరుద్ధమని సీనియర్ తెలిపారు. అంతేకాకుండా, రెవెన్యూ అధికారులు విగ్రహాన్ని తొలగించాలని బీజేపీ కార్యకర్తలను కోరినప్పటికీ వారు ఆదేశాలను పాటించడానికి నిరాకరించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి రాగా.. ఈ తొలగింపు దృశ్యాలలో ఒక పోలీసు అధికారి బీజేపీ కార్యాలయం గోడను స్కేలింగ్ చేయడం, ఇతర అధికారులు లోపలికి వస్తూ కనిపించారు.

ఈ ఘటనను తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సైతం వ్యతిరేకించారు. తమిళనాడులోని అవినీతి డీఎంకే ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి చెందిన స్థలంలో భారత మాత విగ్రహాన్ని ప్రతిష్టించే హక్కు కూడా లేదన్నారు. డీఎంకే ప్రభుత్వ అవినీతిని తమ ‘ఎన్‌ మన్‌, ఎన్‌ మక్కల్‌’ యాత్ర బట్టబయలు చేస్తుందన్న భయంతో జిల్లాకు చెందిన ఇద్దరు డీఎంకే మంత్రులు ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఏడాది మార్చిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించిన పది పార్టీ కార్యాలయాల్లో విరుదునగర్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఒకటి.