
హైదరాబాద్ కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు దర్యాప్తును స్పీడప్ చేశారు SOT పోలీసులు. బుధవారం (సెప్టెంబర్ 10) రాత్రి అత్యంత కిరాతకంగా చంపి పారిపోయిన దుండగుల కోసం వేట మొదలెట్టిన పోలీసులు.. ఇప్పటికే గురువారం ఉదయం ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు.
ఈ కేసులో గురువారం (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం ప్రాంతంలో రెండో సారి స్వాన్ లేక్ అపార్ట్మెంట్ కు చేరుకున్నారు . నిందితులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు మరోసారి అపార్ట్మెంట్ కు వచ్చారు. ఈ కేసులో నిందితుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. నిందితులు ముంబై హైవే వైపు వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళ హత్య కేసును ఛేదించేందుకు ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక పోలీస్ టీమ్ దర్యాప్తు కోసం ఝార్ఖండ్ కు సైతం వెళ్లింది.
కూకట్పల్లిలో ఇలాంటి ఘటనలు పెరిగాయి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
ఘటన గురించి తెలుసుకున్న కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో ఉంటున్న రేణు అగర్వాల్ అనే మహిళ హత్య కు గురికావడం దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
మహిళను అత్యంత దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో దొంగతనలు ఎక్కువ అయితున్నాయని.. ఒక్క కూకట్ పల్లి లోనే గత 20 రోజుల నుంచి ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగతున్నాయని అన్నారు.
ఇంట్లో పని మనిషిగా పెట్టుకునే యజమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పనికి పెట్టుకునే ముందే పోలీసులకి సమాచారం ఇవ్వాలని సూచించారు.