చౌటుప్పల్ ఎంపీపీ అరెస్ట్ కు అర్ధరాత్రి పోలీసుల ప్రయత్నం

చౌటుప్పల్ ఎంపీపీ అరెస్ట్ కు అర్ధరాత్రి పోలీసుల ప్రయత్నం

హైదరాబాద్ : వనస్థలిపురంలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది. తంగిరిళ్ళలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్న వెంకట్ రెడ్డి ఇంటి మూడవ అంతస్తును చుట్టు ముట్టిన SOT, CCS పోలీసులు.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నారన్న సమాచారంతో పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు అర్ధరాత్రి సమయంలో తమ ఇంటికి వచ్చారని తాడూరి వెంకట్ రెడ్డి చెప్పారు.  తాను టీఆర్ఎస్ ను వీడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... పోలీసులచే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తాడూరు వెంకట్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుని.. ఆయన్ను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును వారు తీవ్రంగా ఖండించారు. 

బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడేది లేదు
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను తప్పనిసరిగా ఓడించి.. బీజేపీ జెండా ఎగురవేస్తామని తాడూరి వెంకట్ రెడ్డి చెప్పారు. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తాను టీఆర్ఎస్ బీఫామ్ పై ఎంపీపీగా గెలవలేదని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేసేందుకు రాత్రి సమయంలో ఇంటికి ఎందుకు వచ్చారని పోలీసులను అడిగితే బెదిరింపులకు దిగారని, వారెంట్ ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో మంత్రి జగదీష్ రెడ్డి విధానం నచ్చకనే బీజేపీలో చేరబోతున్నామని చెప్పారు. 

టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం 
మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పిన నాయకులను అర్థరాత్రి సమయంలో అక్రమంగా అరెస్ట్ లకు తెరలేపారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారని చెబుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలోనే అతిపెద్దదైన చౌటుప్పల్ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. సొంత పార్టీ నాయకులను కాపాడుకునే పనిలో పడింది. గత కొంతకాలం నుంచి టీఆర్ఎస్ లో ఉంటున్న తాడూరి వెంకట్ రెడ్డి.. మంత్రి జగదీష్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరును తప్పుపడుతూ వస్తున్నారు. ఈ మధ్యే కొంతమంది జెడ్పీటీసీలు, సర్పంచులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశానని, బీజేపీలోకి వెళ్లేందుకు సంప్రదింపులు చేయడంతో తనపై మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు.