వెలుగు ఓపెన్ పేజీ.. పోలీసు వ్యవస్థకు ఆదర్శం కొత్వాల్

వెలుగు ఓపెన్ పేజీ.. పోలీసు వ్యవస్థకు ఆదర్శం కొత్వాల్

పోలీసుశాఖకు  ప్రతినిధులుగా ప్రజలు సుఖంగా జీవించడానికి అవసరమైన భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. అంతటి పవిత్ర కార్యసాధనకు తమ కుటుంబ జీవన సుఖాలను విస్మరించి పగలు, రాత్రులనే తేడా లేకుండా పోలీసు శాఖ  శ్రమిస్తోంది.   పండుగలకు,  పబ్బాలకు పోలీసులు తమ  కుటుంబాలతో  ఉండటం చాలా అరుదు.  ప్రజల రక్షణ కోసం  ఉగ్రవాదులను ఎదుర్కోవడంలోనూ  ప్రాణత్యాగాలకు సైతం వెనుదీయరు.  అయినా పోలీసుల శ్రమను, త్యాగాలను  ప్రజలు ఎందుకు  అర్థం చేసుకోరు?  వారికి  గుర్తింపునివ్వడానికి ఎందుకు వెనుకంజ వేయడం జరుగుతున్నది?  ఇలాంటి ప్రశ్నలకు  పోలీసు స్టేషనులో పనిచేస్తున్న ప్రతి పోలీసు మదిలో  అంతర్లీనంగా కదలాడుతున్న ఆవేదన ఇది.  

పోలీసుల సేవాకాలమంతా  వివిధ మనస్తత్వాలు, పోకడలపై అధ్యయనం చేసి అవసరమైనమేరకు తగు చర్యలు తీసుకోగల నిష్ణాతులుగా  ప్రతి పోలీసు అధికారి ఎదుగుతాడు. తద్వారా ప్రజల అశాంతికి కారకులైనవారిని చట్టరీత్యా బంధించి శాంతిభద్రతలను పోలీసు అధికారులు అదుపులో ఉంచగలుగుతున్నారడం అక్షరాలా సత్యం. అంతటి  ప్రతిభావంతమైన పోలీసు తనకు సంబంధించిన వ్యక్తిగత విషయంలో సత్య శోధనకు ఎందుకు పూనుకోవడం లేదు?  అందుకు గల కారణం జన సామాన్యులందరికీ  తెలియకపోయినా,  ప్రజల నాడిని పసిగట్టే పోలీసులందరికీ  అర్థమైన విషయమే.  దానికితోడు  పోలీసు ఉన్నతాధికారులు, సామాజిక విశ్లేషకులు తమ విశ్లేషణలను సభల్లోనో, సమావేశాల్లోనో, వార్తా పత్రికల ద్వారానో ఇటు పోలీసులకు, అటు ప్రజలకు అర్థమయ్యేలా యథార్థాలను  తెలియపరుస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న  పోలీసులు వాటిని చదివినా తద్వారా తమ తమ  ప్రవర్తనలపై ఆత్మశోధన చేసుకోవడానికి 
ప్రాధాన్యతనియ్యడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం.

ప్రజలు, పోలీసుల మధ్య అవినాభావ సంబంధం

ప్రజాస్వామ్య పాలనలో ప్రజలు, పోలీసులు అవినాభావ సంబంధాలను కలిగి ఉండాలి.  ప్రతిపనిలో  పోలీసులు తీసుకునే నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి.  అవసరమైన సందర్భంలో ప్రజలను పోలీసులు భాగస్వాములుగా చేర్చుకుని ముందుకు కొనసాగుతుండాలి.  బాధితులు పోలీసు స్టేషనుకు తమ ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చేవారితోగాని,  కేసులలో సాక్ష్యమివ్వడానికి వచ్చేవారితోగాని, నేరస్తుల ఆచూకీకి సంబంధించిన సమాచారమివ్వడానికి వచ్చేవారితోగాని  పోలీసులు సౌమ్యంగా వ్యవహరించాలి. వారిపట్ల సానుభూతిని ప్రదర్శించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ  పౌరుల పట్ల పోలీసులు కటువుగా స్పందించడం సరికాదు.  రాజకీయ బహిరంగ సభల్లో, పండుగల బందోబస్తు విధుల నిర్వహణల్లో, ఇతర ప్రజా సమూహాల్లో ప్రజలతో వ్యవహరించినప్పుడు పోలీసులు ప్రదర్శించే దురుసుతనం, ఆక్షేపణీయమైన భాషా ప్రయోగం వల్ల వారిపట్ల ప్రజల్లో ఏహ్యభావాన్ని కలగజేస్తాయి. 

పౌరహక్కులను గౌరవించాలి

ముఖ్యంగా ప్రముఖుల పర్యటనల సందర్భంగా నిర్వహించే బందోబస్తు డ్యూటీల సమయంలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజల పౌరహక్కులను  గౌరవంతో మదిలో ఉంచుకుని వ్యవహరించడంవల్ల వారి వృత్తికి, వ్యక్తిగత కీర్తికి వన్నెను చేకూర్చిన వారవుతారు.  ఆయా సందర్భాలలో ప్రజల సహకారాన్ని పొందుతూ పోలీసులు వ్యవహరించగలిగితే పోలీసు శాఖ ప్రతిష్ఠ ఇనుమడిస్తుంది.  స్త్రీలు,  పిల్లలు, వృద్ధుల పట్ల పోలీసులు వ్యవహరించాల్సిన తీరును పోలీసు చట్టాలలో విశదీకరించడం జరిగింది.  అలా నిబంధనలకు కట్టుబడి వ్యవహరించే పోలీసులు అధికారి ప్రజాకర్షణగల పోలీసు అధికారిగా కీర్తిని సంపాదించినవాడు అవుతాడు. విధి నిర్వహణలో బలమైన సాక్ష్యాల ఆధారంగా అదుపులోనికి తీసుకున్న వ్యక్తులను ఇంటరాగేషన్‌‌‌‌ చేసే సమయంలో  పౌరులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలి. అంటే వారిని ప్రశ్నించే విధానంలో  పరుషంగా మాట్లాడటం, భౌతికంగా హానికర చర్యలకు పాల్పడటం  సరైన విధానం కాదని ప్రతి పోలీసు అధికారి గుర్తించాలి. అసహాయ  పరిస్థితులలో పోలీసుల​అధీనంలోకి వచ్చిన వ్యక్తిని భయభ్రాంతులకు గురిచేయకూడదు.  

నేరస్తుల మదిలో పరివర్తనా బీజాలు నాటాలి

ఇంటరాగేషన్ ప్రక్రియను కొనసాగించేటప్పడు నేరస్తుని మదిలో పరివర్తనా బీజాలు నాటేలా ఉండాలి. తద్వారా నేర నివారణ చర్యలు తీసుకునేటప్పుడు ఆ వ్యక్తులు సదాభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటారు. నిర్బంధంలోకి తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుపరచవచ్చును.  పోలీసు అధికారి ప్రజాస్వామ్యసారాన్ని అనుసరించి చట్టం అమలుచేసి, సమయస్ఫూర్తి, మెలకువలను ప్రదర్శిస్తూ పౌరహక్కులను, తన బాధ్యతలను స్ఫురణకు తెచ్చుకుంటూ విధులు నిర్వహించాలి.  అటువంటి కౌశలాలన్నింటిని మనసా, వాచా, కర్మణా ఆచరించి  కుల, మతాలకు అతీతంగా వ్యవహరించిన కొత్వాలు పాశం వెంకరామిరెడ్డిని పోలీసు శాఖ ఆదర్శంగా తీసుకోవాలి. హైదరాబాద్  నగర  సమర్థ కొత్వాలుగా, సంఘ సంస్కర్తగా  ప్రజల మనసులు గెలిచినవిధానం సర్వత్రా అనుసరణీయం, హర్షణీయం.

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి, అడిషనల్‌‌ ఎస్పీ (రి)

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.