ఫ్రెంచ్‌‌‌‌ క్వీన్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌.. ఫైనల్లో ముచోవాపై విక్టరీ

ఫ్రెంచ్‌‌‌‌ క్వీన్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌.. ఫైనల్లో ముచోవాపై విక్టరీ

పారిస్‌‌‌‌: పోలెండ్‌‌‌‌ స్టార్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌ వన్‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌ విమెన్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్‌‌‌‌సీడ్‌‌‌‌ స్వైటెక్‌‌‌‌ 6–2, 5–7, 6–4తో కరోలినా ముచోవా (చెక్‌‌‌‌)పై గెలిచింది. దీంతో గత నాలుగేళ్లలో రోలాండ్‌‌‌‌ గారోస్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ మూడో టైటిల్‌‌‌‌ను చేజిక్కించుకుంది. 2 గంటల 46 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ బలమైన సర్వీస్‌‌‌‌లతో ఆకట్టుకుంది. అయితే టోర్నీ మొత్తం ఒక్క సెట్‌‌‌‌ కూడా కోల్పోకుండా ఫైనల్‌‌‌‌కు వచ్చిన పోలెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌.. టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో మాత్రం రెండో సెట్‌‌‌‌లో అనూహ్యంగా తడబడింది. స్టార్టింగ్‌‌‌‌లో బేస్‌‌‌‌లైన్‌‌‌‌ నుంచి యాంగిల్ షాట్స్‌‌‌‌తో చెలరేగిన స్వైటెక్‌‌‌‌ 3–0 లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. 

ఐదో గేమ్‌‌‌‌లో ముచోవాకు సర్వీస్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌ వచ్చినా ఉపయోగించుకోలేకపోయింది. బ్యాక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ విన్నర్‌‌‌‌, డ్రాప్‌‌‌‌ షాట్‌‌‌‌ కొట్టడంలో ఫెయిలైంది. ఇక రెండో సెట్‌‌‌‌ ఆరంభంలో స్వైటెక్‌‌‌‌ జోరు కొనసాగింది. ముచోవా అన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌డ్‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌ చేయడంతో పోలెండ్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ 4–1తో లీడ్‌‌‌‌లోకి వెళ్లింది. కానీ ఆరో గేమ్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ చేయడం ముచోవాకు కలిసొచ్చింది. ఫోర్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ షాట్లతో వరుసగా పాయింట్లు నెగ్గి 5–5తో స్కోరును సమం చేసింది. 11వ గేమ్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ సర్వ్‌‌‌‌ను బ్రేక్‌‌‌‌ చేసిన ముచోవా లీడ్‌‌‌‌లోకి వచ్చింది. ఆ వెంటనే తన సర్వ్‌‌‌‌లో ఫుల్‌‌‌‌ స్ట్రెచ్‌‌‌‌తో అద్భుతమైన వ్యాలీని సంధించి సెట్‌‌‌‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌‌‌‌లో స్వైటెక్‌‌‌‌ వరుసగా మూడు గేమ్‌‌‌‌లు గెలిచి జోరందుకుంది. 

ఏడో గేమ్‌‌‌‌లో సర్వీస్‌‌‌‌ కోల్పోయినా ముచోవాకు ఎలాంటి చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. 10వ గేమ్‌‌‌‌లో ముచోవా డబుల్‌‌‌‌ ఫాల్ట్‌‌‌‌ చేయడంతో స్వైటెక్‌‌‌‌ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. విన్నర్‌‌‌‌గా నిలిచిన స్వైటెక్‌‌‌‌  రూ. 20 కోట్ల 50 లక్షలు, రన్నరప్‌‌‌‌ ముచోవా  రూ. 10 కోట్ల 28 లక్షలు ప్రైజ్‌‌‌‌మనీ అందుకున్నారు. మరోవైపు నేడు జరిగే మెన్స్‌‌‌‌ ఫైనల్లో థర్డ్‌‌‌‌ సీడ్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌ (సెర్బియా).. కాస్పెర్‌‌‌‌ రుడ్‌‌‌‌ (నార్వే)తో తలపడనున్నాడు.