యాగాలు సరే, త్యాగాల సంగతేంటి..? : దిలీప్ రెడ్డి

యాగాలు సరే, త్యాగాల సంగతేంటి..? : దిలీప్ రెడ్డి

‘అదిరిందయ్యా చంద్రం’ అని అప్పట్లో ఓ వ్యాపార ప్రకటన బాగా ఆకట్టుకునేది. ‘కొత్త కారు.., కొత్త ఇల్లు.., కొత్త భార్య.. వావ్‌ అదిరిందయ్యా చంద్రం..’ ఇలా సాగుతుంది ఆ సృజనాత్మక ప్రకటన. పాత పార్టీకి కొత్త పేరే అయినా... భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) ఢిల్లీ  ఓపెనింగ్‌ అదిరింది! చెట్టుకింద ముచ్చట్ల నుంచి సంపాదకుల పేజీల్లో వ్యాసాలు, టీవీ వేదికల్లో వాదోపవాదాల వరకు టన్నులకు టన్నుల చర్చ సాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్​గురించి, ఆయన ఊహశాల్యత, వ్యూహ చతురత గురించి బాగా తెలిసిన వారు మాత్రం లోలోపల నవ్వుకుంటున్నారు. సుదూర ముందుచూపుతో కేసీఆర్‌ వేసే ఎత్తుగడల గురించి వారికి బాగా తెలుసు. నిప్పులేనిదే పొగ రాదన్నట్టు, అవసరం లేనిదే ఆయన ఎత్తులు కూడా వేయరని వాళ్ల బలమైన నమ్మకం. ‘ఇప్పుడు ఏం అవసరం వచ్చిందని జాతీయ పార్టీ?’ అని అమాయకంగా అడిగే వారూ ఉంటారు. వారికి విషయం కాస్త ఆలస్యంగా అర్థం కావొచ్చు! ఇది మరీ కొత్తదేం కాదు. దాదాపు అయిదేండ్ల కేసీఆర్‌ కల! 2018 ఎన్నికలప్పుడే ఆయన జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల పునరేకీకరణ గురించి గొంతెత్తారు. 2019 ఎన్నికలకు ముందర కొంత హడావుడి కూడా చేశారు.ఈ దిశలో కలిసివచ్చే వారితో స్నేహబంధం పెనవేసేందుకు చాలా రాష్ట్రాలు తిరిగారు ! అలా కాలికి బలపం కట్టుకు తిరగడానికి ముందు, తిరిగొచ్చాక... తన దృష్టిలోంచి జారిపోని కఠిన వాస్తవాలపైనా ఆయనకు సమగ్ర అవగాహన ఉంది. ఏమైతేనేం, అయిదారు దశాబ్దాల పోరు తర్వాత తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం వెనుక ముఖ్య పాత్ర పోషించిన టీఆర్‌ఎస్‌ ఎట్టకేలకు బీఆర్‌ఎస్‌ అయింది. పార్టీ పేరులోంచి ‘తెలంగాణ’ పదం పోయింది కాబట్టి సదరు సెంటిమెంటు ఇక పార్టీకి దూరమౌతుంది, తెలంగాణలో పార్టీ రాజకీయంగా దెబ్బతింటుంది.. ఇలాంటి విశ్లేషణలు కూడా ప్రత్యర్థులో, గిట్టనివారో చేస్తూనే ఉన్నారు. దాన్ని టీఆర్‌ఎస్‌ ఖండిస్తున్నది, ఇదొక పరిణామం. 

స్వరాష్ట్ర సానుభూతే లక్ష్యమా?

2004 సాధారణ ఎన్నికలప్పుడు జాతీయ మీడియాలో ఏపీ గురించిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ఒక విశ్లేషణ బాగా ప్రాచుర్యం పొందింది. ‘సరుకు కాదు కదా, కనీసం పైన రేపర్‌ కూడా మార్చకుండా పాత సబ్బునే చంద్రబాబు కొత్తగా అమ్మాలని చూస్తున్నారు, స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు, ఈ ఎన్నికల్లో ఆయన ఎత్తులు పారవు, ఓటమి ఖాయం’ అని చేసిన విశ్లేషణ బాగా క్లిక్‌ అయింది. కడకు అదే నిజమైంది. రెండు పర్యాయాల గెలుపు తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి కూడా అలాగే తయారైందని, పాత నినాదాలు, సెంటిమెంటు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదని ఒక అంచనా! అందరి దృష్టిని జాతీయ రాజకీయాల వైపు మళ్లించి, మోడీకి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్న ‘భూమి పుత్రుడు’గా తెలంగాణ ప్రజల మనసు గెలవొచ్చన్నది ఆశ. నిన్నటి గుజరాత్‌ ఎన్నికల ఫలితం, భూమిపుత్రులుగా ప్రధాని మోడీ, ఆయన జోడీ అమిత్‌ షాలను గుజరాతీలు ఆదరించి, ఘనంగా మళ్లీ పట్టం కట్టిన తీరు కేసీఆర్‌ దృష్టిని ఆకర్షించకుండా ఉండదు. తెలంగాణలో ఎటుతిరిగి 60కి పైగా అసెంబ్లీ సీట్లు గెలవటం మొదటి లక్ష్యం. కొన్ని కార్పొరేట్లు... అదే బ్రాండ్‌కు ‘ప్లస్​’ అనో, ‘ఎక్స్‌ట్రా’ అనో తగిలించి లబ్ధి పొందినట్టు పేరు మార్పిడి ఏ మాత్రం లాభించినా మంచిదే! రాష్ట్ర ప్రజల దృష్టిని జాతీయ అంశాలవైపు మళ్లించి, విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా స్థానికాంశాలను ఎన్నికల ఎజెండా కానీయకుండా చేయడానికి, బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం ఏ మాత్రం ఉపయోగపడ్డా రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే! నలుగురుకి కనబడేలా గురి ఒకచోట, కానీ దెబ్బ మాత్రం మరో చోట అన్నది కనబడని వ్యూహమనే అభిప్రాయం కూడా ఉంది. లోక్‌సభ ఎన్నికల కన్నా ముందే జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే, ఇంతకాలం ప్రచారం జరుగుతున్నట్టు తనయుడు కేటీఆర్‌ను ఏ ప్రతికూలత లేకుండా, సరళంగా సీఎం చేసి, తాను జాతీయ రాజకీయాల్లో మరింత బిజీ కావచ్చు. ప్రత్యర్థుల విమర్శలకు తావు లేకుండా అది హేతుబద్ధంగానూ కనబడుతుంది.

యాగాలు సరే, త్యాగాల సంగతేంటి?

ఇప్పుడు రకరకాల యాగాలు చేస్తూ రాజకీయంగా ముందుకు వెళుతున్నారు సరే, మరి తెలంగాణ అడుగడుగునా సాగిన ఆత్మ బలిదానాలు, త్యాగాల సంగతేంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రవాదానికున్న బలం, ఆ ఉద్యమం వెనుక ఉన్న త్యాగాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. అందువల్లే జనాదరణ పరంగానే కాక రాజకీయంగానూ ఎంతో ఎత్తు ఎదిగింది. తెలంగాణ పట్ల వారికున్న నిబద్ధతే అందుకు కారణం. మరి తెలంగాణ పదాన్ని వదిలేసి జాతీయ పార్టీగా మారుతున్నపుడు అందుకు తగిన భూమిక కావాలిగా, మరేది? అన్న ప్రశ్న సహజం. తరచూ విమర్శలకు గురవుతున్న ‘తెలంగాణ నమూనా’ మాత్రమే సరిపోతుందా? ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరాది, హిందీ రాష్ట్రాల్లో నాయకులైనా, ప్రజలైనా ఎందుకు బీఆర్‌ఎస్‌ను ఆదరించాలి? పార్టీ అధినేతలు భావిస్తున్నట్టు ఆయా ప్రాంతాల ప్రజల కన్నా ముందు, అక్కడి పార్టీలను మచ్ఛిక చేసుకోవడం ముఖ్యం కావచ్చు. అప్పటివరకున్న తమ పేరును రద్దు చేసుకొని బీఆర్‌ఎస్‌లో విలీనం అయ్యే పార్టీలుంటాయా? పోనీ, నిర్ద్వందంగా వెంట నడిచే పార్టీలు ఎన్ని ఉంటాయి? ప్రాంతీయ పార్టీలుగా పుట్టి జాతీయ స్థాయికి ఎదిగిన గొప్ప చరిత్ర ఎవరికీ లేదీ దేశంలో! పేరులోనే ‘ద్రవిడ’ అనే మాట ఉన్నా డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలు తమిళనాడు బయట మనలేకపోయాయి. ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీలుగా పుట్టి జాతీయమని ప్రకటించుకున్న పార్టీలు, ఒకే భాషా ప్రాంతాలైనా పొరుగు రాష్ట్రాల్లో ఉనికి నిలబెట్టుకోలేదు. విభజనలో పుట్టిన రాష్ట్రాలే అయినా, పంజాబ్‌ అకాళీదళ్‌కు హర్యానాలో, ఉత్తర్‌ప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీకి ఉత్తరాఖండ్‌లో, బీహార్‌ ఆర్జేడీకి ఉత్తరాఖండ్ లోనే ఏమీ ఉండదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో హిందీ భాష, యాదవ కుల నేపథ్యం ఉన్నప్పటికీ ములాయం, అఖిలేశ్‌లకు బీహార్‌లో చోటు దక్కదు, అలాగే నితీశ్(జేడీయూ), లాలూ ప్రసాద్‌(ఆర్జేడీ)లకు ఉత్తరప్రదేశ్‌లో ఉనికి కష్టం. అలాంటిది ఒక దక్షిణాది పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అయితే... ఉత్తరాది రాష్ట్రాల్లో దక్కే స్థానం, ఆదరణ, కడకు రాజకీయంగా గెలుపు ఎంత? అన్నది సమాధానం రావాల్సిన కోటి రూకల ప్రశ్న! మోడీది దుష్టపాలన, అది అంతం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలతో దేశంలో గుణాత్మక మార్పుకే తమ కొత్త పార్టీ అంటున్న బీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్​ చాన్నాళ్లుగా ఓ మాట చెబుతున్నారు. తాటాకు చప్పుళ్లతో ఏదీ కాదంటూ, గట్టి శబ్దంతో ఆయన రావాలంటున్న ‘పొలికేక’ ఎప్పుడా? ఎంత గంభీరంగా ఉంటుందా? అదే మొత్తం మార్పు తెస్తుందా? అని జనం ఎదురుచూస్తున్నారు. దాని మీదే బీఆర్‌ఎస్‌ ఎదుగుదల ఆధారపడొచ్చేమో!?

తప్పేముంది? తప్పేదేముంది?

జాతీయ రాజకీయాల్లో ఓ గుణాత్మకమైన మార్పు అవసరముందని, అందుకే తామొక ప్రయత్నం చేస్తున్నామని కేసీఆర్‌ కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. దేశంలో రెండు ప్రధాన స్రవంతి పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు తాము నేరుగా పాలిస్తూ గానీ, తమ నేతృత్వపు కూటముల ద్వారా గానీ సరైన పాలనను ఈ దేశానికి అందించలేకపోయాయనేది ఆయన భావన! సదరు రాజకీయ శూన్యతను పూరించేందుకు భావసారూప్యత కలిగిన వారంతా కలిసిరావాలని కొంత కాలంగా కోరుతున్నారు. చివరకు తానే ఒక జాతీయ పార్టీని తీసుకురావడం ఆ కృషిలో ఓ ముందడుగు. తనకొక అభివృద్ధి– సంక్షేమ నమూనా ఉందని, దాన్ని దేశవ్యాప్తం చేస్తామనే ప్రతిపాదన పనికొస్తుందని ఆయన విశ్వాసం.  విద్యుత్‌ సదుపాయ విస్తరణతో పాటు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం – బాహుబలి ప్రాజెక్టు నిర్మాణం, దళిత బంధు, రైతుబంధు ద్వారా రైతుకు పంటపెట్టుబడి నగదు ఇవ్వడాల్ని ఎజెండా చేసి, వాటిని దేశ వ్యాప్తం చేస్తామనే నినాదం ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లిక్‌ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. అవ్యవస్థీకృతంగా ఉన్న రైతులు, రైతు సంఘాలను ఒకటి చేస్తే తనకు రాజకీయంగా కూడా కలిసి వస్తుందని ‘అబ్​కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ నినాదం ఎత్తుకున్నారు.  కాంగ్రెస్‌తోనో, బీజేపీతోనో అంటకాగక, సొంతంగా పెద్ద ఆర్థిక వనరుల్లేని కొన్ని చిన్న చితకా పార్టీల నాయకులు ఆయన వెంట నడువడానికి ఇప్పటికే సంకేతాలిచ్చారు. తెలంగాణతో పాటు పొరుగునున్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలోని ఇటువంటి కొన్ని పార్టీలతో చేతులు కలిపి, వారిని శాసనసభకు పోటీ చేయండని, లోక్‌సభ ఎన్నికల్లో తనతో కలిసి సాగమని ఆయన కోరొచ్చు. అలాంటి పొత్తుల్లో 100 నుంచి150 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే ఆస్కారం ఉంది. ఇది పక్కా ప్రజాస్వామ్యబద్ధమైన వ్యూహం, ఎత్తుగడ! తెలంగాణ బయట బీఆర్‌ఎస్‌ సొంతంగా సీట్లు సాధించే సంగతెలా ఉన్నా ఒకటి, రెండు రాష్ట్రాల్లోనైనా6 శాతానికి పైగా ఓట్లు సాధించి జాతీయపార్టీగా గుర్తింపు తెచ్చుకోవడం వారి సత్వర లక్ష్యం కావొచ్చు.

- దిలీప్‌ రెడ్డి, పొలిటికల్‌ ఎనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ