రగులుతున్న సూర్యాపేట! .. వట్టే జానయ్యపై కేసులతో పొలిటికల్ ​హీట్​

రగులుతున్న సూర్యాపేట! .. వట్టే జానయ్యపై కేసులతో పొలిటికల్ ​హీట్​
  • మద్దతుగా తరలివస్తున్న బీసీ నేతలు
  • మంత్రి జగదీశ్, బీఆర్ఎస్​కు యాదవ సంఘాల హెచ్చరికలు
  • జానయ్యపై కేసులు ఎత్తివేయాలని పెరుగుతున్న డిమాండ్లు
  • నేడు సూర్యాపేటకు రానున్న ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్
  • అప్రమత్తమైన పోలీసులు

సూర్యాపేట, వెలుగు: బీఆర్​ఎస్​ నేత, డీసీఎంఎస్ చైర్మన్  వట్టె జానయ్యపై పెట్టిన కేసులతో సూర్యాపేటలో మొదలైన పొలిటికల్​హీట్​క్రమంగా రాజుకుంటోంది. తొమ్మిదేండ్లపాటు మంత్రి జగదీశ్​రెడ్డి ముఖ్యఅనుచరుడిగా వ్యవహరించిన వట్టె జానయ్య, ఈసారి టికెట్​అడిగిన పాపానికి సొంత పార్టీ నుంచే  కక్ష సాధింపులు మొదలయ్యాయనే ఆరోపణలున్నాయి. జానయ్య తమ భూములు కబ్జా చేశారంటూ 70 మందికి పైగా బాధితులు పీఎస్​లో ఫిర్యాదు చేయడం, ఏకంగా 12 కేసులుపెట్టడం సంచలనం సృష్టించింది.

ఈ క్రమంలో జానయ్యకు బీసీ నాయకుల మద్దతు పెరుగుతున్నది. ముఖ్యంగా రాష్ట్రం నలుమూలల నుంచి యాదవ సంఘాలు, యాదవ విద్యావంతుల వేదిక నాయకులు తరలివచ్చి మంత్రి జగదీశ్​, బీఆర్​ఎస్ హైకమాండ్​​లక్ష్యంగా  విమర్శలు గుప్పిస్తున్నారు.  జానయ్యపై పెట్టిన కేసులు ఎత్తివేయకపోతే మంత్రితో పాటు రూలింగ్​పార్టీ అంతుచూస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా జానయ్యకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం సూర్యాపేటకు బీఎస్పీ స్టేట్​ చీఫ్​ ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ రానుండడం ఆసక్తి రేపుతోంది. 

 టికెట్ అడిగినందుకే.. 

బీఆర్​ఎస్​ నేత, డీసీఎంఎస్ చైర్మన్  వట్టె జానయ్య తొమ్మిదేళ్లుగా మంత్రి జగదీశ్​రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నాడు. 2018 ఎన్నికల్లో   సూర్యాపేట రూరల్ మండలం నుంచే బీఆర్​ఎస్​కు భారీ మెజార్టీ వచ్చింది. జానయ్య కృషి వల్లే ఈ లీడ్​ సాధ్యమైందని, అందువల్లే మంత్రి గెలిచారనే ప్రచారం జరిగింది. దీంతో జానయ్యకు డీసీ‌‌ఎం‌‌ఎస్ చైర్మన్ పదవి దక్కింది. కాగా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ కోటా కింద జానయ్యకు సూర్యాపేట టికెట్​వస్తుందని ఆయన అనుచరులు ప్రచారం చేయడంతో అప్పటి నుంచి  మంత్రికి, జానయ్యకు మధ్య  దూరం పెరిగింది.

ఈ క్రమంలో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన జానయ్య, అసెంబ్లీ ఎన్నికల్లో తాను సూర్యాపేట నుంచి పోటీ చేస్తానని గత నెలలో బహిరంగంగా  ప్రకటించారు. జానయ్యకు నియోజకవర్గంలో బీసీ వర్గాల మద్దతు ఉండడంతో సహజంగానే బీఆర్ఎస్​ నేతలు అయనపై కన్నెర్ర జేశారు. తాను  పోటీలో ఉంటానని  ప్రకటించిన మరునాడే జానయ్య తమ భూములను ఆక్రమించారంటూ నలుగురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  ఆదే రోజు  జానయ్య పై నాలుగు కేసులు నమోదు కాగా, మర్నాడు  మరో 70మంది తమ భూములు సైతం కబ్జా చేశారంటూ జానయ్యపై  ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. కాగా, ఈ ఫిర్యాదుల వెనుక  జగదీశ్​ రెడ్డి హస్తం ఉందనే  ప్రచారం జరుగుతోంది.   

ఆచూకీ లేని జానయ్య

వారం రోజుల కింద కేసుల ఎపిసోడ్​ మొదలుకాగా, అప్పటి నుంచి జానయ్య ఆచూకీ దొరకడం లేదు.  గత నెల 25న హైదరాబాద్​లో బీసీ గర్జనలో పాల్గొన్న తర్వాత ఆయన ఇప్పటివరకు కనిపించలేదు. జానయ్యను మంత్రి తన అనుచరులతో, పోలీసులతో కిడ్నాప్ చేయించారని జానయ్య భార్య,  కౌన్సిలర్ రేణుక, జానయ్య తల్లి అయిలమ్మ  ఆరోపించారు. ఈ క్రమంలో జానయ్య కుటుంబ సభ్యులను, అనుచరులను పోలీసులు అదుపులోకి  తీసుకుని విచారించారు.

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై బీఆర్ఎస్​ లీడర్లు కావాలనే  కేసులు పెట్టిస్తున్నారని, వీటిని అడ్డుకోవాలంటూ జానయ్య హై కోర్టును ఆశ్రయించారు.  ఆయన పిటిషన్​ను విచారించిన కోర్టు జానయ్య పై కేసులు నమోదు చేయరాదని, ఇప్పటికే ఉన్న కేసులపై  ఈ నెల 13లోపు కౌంటర్​ దాఖలు చేయాలని  రాష్ట్ర హోం ప్రిన్సిపల్ సెక్రెటరీ,  డీజీపీ,  ఐ‌‌జీ, డీఐ‌‌జీ, ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు నోటీసులు జారీ చేసింది.  పీడీ యాక్ట్ నమోదు చేయరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది.  మరోవైపు జానయ్య ముందస్తు బెయిల్ కోసం కూడా  హై కోర్టులో పిటిషన్​ వేసినట్టు తెలుస్తోంది.         

 ఏకమవుతున్న బీసీలు

 కాగా జానయ్యకు మద్దతుగా బీసీ సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా  ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే  జానయ్యకు  బీఎస్పీ పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీసీ నేతలు  సంఘీభావం తెలుపుతున్నారు.  ఇటీవల యాదవ సంక్షేమ సంఘం, యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సూర్యాపేటలో మీటింగులు నిర్వహించిన  నాయకులు అటు బీఆర్ఎస్​ను, ఇటు మంత్రి జగదీశ్​రెడ్డిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.  జానయ్యపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ చలకాని వెంకట్ యాదవ్  డిమాండ్ చేశారు.

లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. నిజానిజాలను తేల్చకుండా ఓ వర్గం మీడియా జానయ్యను నరరూప రాక్షసుడిగా చిత్రించడాన్ని తప్పుపట్టారు. మరోవైపు యాదవులు బీఆర్ఎస్​కు వ్యతిరేకంగా మారడంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు  శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనం రసాభాసగా మారింది. యాదవ నేతలంతా జానయ్యకు మద్దతుగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా  మాట్లాడడం కలకలం రేపింది. చివరికి బీఆర్ఎస్​కు , మంత్రికి వత్తాసు పలుకుతున్న ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తీరును నిరసిస్తూ యాదవులు సమావేశాన్ని బాయ్​కాట్​చేయడం హాట్​టాపిక్​గా మారింది.

జానయ్య కుటుంబసభ్యులను పరామర్శించనున్న బీఎస్పీ స్టేట్​ చీఫ్

బీఎస్పీ స్టేట్​ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జానయ్య కు మద్దతుగా నేడు సూర్యాపేట కు రానున్నారు. ఇప్పటికే జానయ్య పై నమోదు చేసిన అక్రమ కేసులను నిరసిస్తూ గత నెల 30న ఆందోళనలకు పిలుపునిచ్చిన ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికా పర్యటన ముగించుకొని ఇటీవలే ఇండియా వచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం సూర్యాపేటలోని జానయ్య  కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన ఇంటి దగ్గరే  ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మరోపక్క  సూర్యాపేటకు ఆర్‌‌ఎస్ ప్రవీణ్ కుమార్  రానుండడంతో  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.