ఓట్ల రాజకీయాలు షురూ..! కమ్యూనిటీ హాల్స్​కు రూ. లక్షల ఫండ్​

ఓట్ల రాజకీయాలు షురూ..! కమ్యూనిటీ హాల్స్​కు రూ. లక్షల ఫండ్​
  • దేవాలయాలు, మసీదులకు చందాలు
  • పెళ్లిళ్లు, చావులకు డబ్బు సహాయం
  • ఓటర్లను ఆకర్షించడానికి లీడర్ల ప్రయత్నాలు 

నిజామాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎలక్షన్​ సమీపిస్తున్న వేళ టికెట్​ఆశిస్తున్న పొలిటికల్ ​లీడర్లు ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం సొంత డబ్బుతో దానధర్మాలు చేస్తూ, ప్రజల్లో గుర్తింపు కోసం తంటాలు పడుతున్నారు. మళ్లీ టికెట్​తమకే వస్తుందని ధీమాతో ఉన్న రూలింగ్​పార్టీ ఎమ్మెల్యేలు తమ సీడీఎఫ్​ ఫండ్స్​నుంచి కమ్యూనిటీ హాల్స్​కు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు.

కుల సంఘాలకు ఫండ్స్​

అర్బన్​లో నియోజకవర్గంలో మూడు కులాల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. ఇందులో ఒక కులం వారు నిర్మిస్తున్న ఆలయానికి ఎమ్మెల్యే సీడీఎఫ్​ నుంచి ​రూ.50 లక్షలు ​ఇచ్చారు. సొంతగా మరికొంత సొమ్ము ఇస్తానని హామీ ఇచ్చారు. మరో కులసంఘానికి సంబంధించి 15 తర్ఫాల  కమ్యూనిటీ బిల్డింగ్​లకు రూ.5 లక్షల చొప్పున ఫండ్స్​ ఇచ్చారు. లాటరీ విధానంలో ఈ 15 సంఘాల సెలెక్ట్​ చేశారు. బీజేపీకి చెందిన ధన్​పాల్​సూర్యనారాయణ ఆలయాల నిర్మాణాలకు రూ.లక్షల డొనేషన్లు ఇస్తున్నారు. గణపతి, దేవీ నవరాత్రి ఉత్సవాలప్పుడు ప్రతీ మండపానికి సహాయం చేస్తున్నారు. నగర కాంగ్రెస్​లీడర్లు యాత్రలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

కులాలతో మంత్రి మీటింగ్​లు..

బాల్కొండలో మంత్రి ప్రశాంత్​రెడ్డి నియోజకవర్గంలోని అన్నీ కుల సంఘాలతో ప్రత్యేకంగా మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. ఒక్కో కుల సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఫండ్​ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్​లో ప్రశాంత్​రెడ్డిపై పోటీ చేసిన ముత్యాల సునీల్​రెడ్డి సేవా కార్యక్రమాలతో ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే, వారి అంత్యక్రియలకు డబ్బు సహాయం చేస్తున్నారు. ఇటీవల ఒక కుటుంబ పెద్ద చనిపోగా, ఆ కుటుంబ సభ్యులకు సొంత డబ్బుతో కిరాణ దుకాణం పెట్టించారు. బీజేపీ లీడల్ డాక్టర్​ మల్లికార్జున్​రెడ్డి చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. 

బోధన్​లో యువత, ముస్లిం వర్గంపై దృష్టి

బోధన్​లో ఎమ్మెల్యే షకీల్​ నియోజకవర్గంలోని అన్నీ కులాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు సీడీఎఫ్​ఫండ్స్​ కేటాయించారు. సీఎం స్పెషల్​ ఫండ్​ కింద మంజూరైన రూ.10 కోట్లలో కొంత వార్డులకిచ్చి, సుమారు రూ.8 కోట్లు మసీదులలకు కేటాయించారు. యువతలో పట్టుకోసం ఇటీవల జాబ్​మేళా నిర్వహించారు. కాంగ్రెస్​ లీడర్​కెప్టెన్​కరుణాకర్​రెడ్డి నియోజకవర్గంలోని అన్నీ విలేజ్​లలో తన పేరుతో యువసేన ఏర్పాటు చేసి, సభ్యులకు హెల్మెట్లు పంపిణీ చేస్తున్నారు. పట్టణంలో పదేండ్లలోపు పిల్లలున్న కుటుంబాలకు దోమతెరలు ఇస్తున్నారు. మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి పేద కుటుంబాల పిల్లల చదువుకు సహాయం చేస్తున్నారు. బీజీపీ లీడర్​ ప్రకాశ్​రెడ్డి, మోహన్​రెడ్డి కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

రూరల్​లోనూ కుల సంఘాలే..

రూరల్ ​ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా కులసంఘాలకు ఈ ఏడాది ఎక్కువ నిధులు ఇచ్చారు. ఎండోమెంట్​ఫండ్స్​ను దేవాలయాల కోసం మంజూరు చేయించారు. కాంగ్రెస్​కు చెందిన డాక్టర్​భూపతిరెడ్డి, నగేశ్​రెడ్డి, బీజేపీ లీడర్ దినేశ్​కుమార్​ పార్టీపరమైన ప్రొగ్రామ్​లతో ప్రజలకు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు.

కుల సంఘాలకు భూమి కేటాయింపులు

ఆర్మూర్​ ఎమ్మెల్యే జీవన్​రెడ్డి సొంత ఖర్చుతో  పేదలకు అన్నదానాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వాహనాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా ఎవరు రియల్​ఎస్టేట్​వెంచర్​ వేసినా, అందులో 10 శాతం ల్యాండ్​ కులసంఘాల అవసరాలకు ఎలాట్​ చేయిస్తున్నట్లు సమాచారం. ప్రతీ కులసంఘానికి ఈసారి తన సీడీఎఫ్​ నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు కేటాయించారు. బీజేపీ లీడర్​ వినయ్​రెడ్డి శివాజీ విగ్రహాల ఏర్పాటుకు డొనేషన్లు ఇస్తున్నారు. పూర్​ ఫ్యామిలీస్​కు ఫైనాన్షియల్​గా​ హెల్ప్​చేస్తూ, పట్టు పెంచుకోడానికి  కృషి చేస్తున్నారు. కంచెట్టి గంగాధర్, కొత్తగా పార్టీలో చేరిన పైడి రాకేశ్​రెడ్డి పేద కుటుంబాలకు సహాయం చేస్తున్నారు. పల్లె గంగారెడ్డి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.