చేరికలపై పార్టీల ఫోకస్ .. మారుతున్న కండువాలు

చేరికలపై పార్టీల ఫోకస్ ..  మారుతున్న కండువాలు

 

  •     జాయినింగ్ ల కోసం ఇన్​చార్జ్​ల నియామకం
  •     అసంతృప్తివాదులు, తటస్థులే టార్గెట్

నిర్మల్, వెలుగు: జిల్లా కేంద్రం నిర్మల్ సెగ్మెంట్ లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజెపీ, కాంగ్రెస్ మైండ్ గేమ్ మొదలు పెట్టాయంటున్నారు. చేరికలపై ఫోకస్ పెట్టి ఇతర పార్టీల్లోని అసమ్మతి, అసంతృప్తి వాదులను టార్గెట్ చేసుకొని పోటీ పడీ మరీ తమ పార్టీలోకి చేర్చుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రెండు వారాలుగా నిర్మల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో యువజన సంఘాలకు కూడా పార్టీలు ప్రాధాన్యతనిస్తూ సంఘాల సభ్యులకు కండువాలు కప్పుతుండడం ఆసక్తికరంగా మారుతోంది.

బీజేపీలోకి జోరుగా చేరికలు

 ముఖ్యంగా బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్​లోనే మకాం వేసి పార్టీలోకి చేరికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. చేరికల పర్వాన్ని మరింత ముమ్మరం చేసేందుకు మండలాల వారీగా చేరికల కమిటీలను కూడా ఏర్పాటు చేసి ఆ కమిటీలకు ఇన్​చార్జ్​లను సైతం నియమించారు. వీరు ప్రతిరోజూ తమ మండల పరిధిలో ఉన్న ఇతర పార్టీల్లోని తటస్తులు, అసమ్మతి వాదులను గుర్తిస్తూ వారితో చర్చిస్తూ తమ పార్టీలోకి రప్పించేందుకు ఒప్పిస్తున్నారు. ప్రతిరోజు మూడు, నాలుగు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఆ గ్రామాల నుంచి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన కేడర్​ను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. 

రసవత్తరంగా రాజకీయాలు

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సైతం బీఆర్​ఎస్​లోకి చేరికలపై ఫోకస్ పెట్టి బీజేపీ, కాంగ్రెస్ కేడర్​ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఇప్పటికే ఆయా మండలాల్లోని పార్టీ సీనియర్ నేతలతో చేరికలపై సీరియస్​గా చర్చించినట్లు సమాచారం. ప్రధాన పార్టీలకు ధీటుగా చేరికలు జరిపించాలని మంత్రి ఇప్పటికే తమ నేతలు, కేడర్​కు ఆదేశాలు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఇందులో భాగంగానే వారం 10 రోజుల నుంచి బీఆర్ఎస్​లోకి చేరికలు కూడా పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోతున్న డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కూడా బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోకి అసంతృప్తి వాదులను దువ్వుతూ తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. 

గులాబీ పార్టీలోని బలహీనతలు తెలిసిన శ్రీహరి రావు ఆ పార్టీ వ్యూహానికి దీటుగా తటస్థులు, అసంతృప్తి వాదులందరినీ తమ పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇలా పార్టీలన్నీ పోటీపడి కార్యకర్తలు, నేతల కండువాలు మారిపిస్తుండడంతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి.