అరుణ వర్సెస్​ వంశీ.. పాలమూరులో వేడెక్కుతున్న రాజకీయాలు

అరుణ వర్సెస్​ వంశీ.. పాలమూరులో వేడెక్కుతున్న రాజకీయాలు

మహబూబ్​నగర్​, వెలుగు :పాలమూరులో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​ రెడ్డి మధ్య వారం రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరికొకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకుంటుండటంతో ఈ విషయం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. మహబూబ్​నగర్​  పార్లమెంట్​ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్​ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు చల్లా వంశీచంద్​ రెడ్డితో పాటు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, పార్లమెంట్​ పరిధిలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.

అయితే గురు, శుక్రవారాల్లో మహబూబ్​నగర్, హైదరాబాద్​లో జరిగిన సమావేశాల్లో వంశీ..  డీకే అరుణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అవకాశవాద రాజకీయాలకు డీకే అరుణ మారు పేరు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఆమె. పూటకో పార్టీ మార్చే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచారు” అంటూ కామెంట్లు​ చేశారు. 2019లో లోక్ సభ ఎన్నికల సమయంలో రూ.15 కోట్లు ఇస్తే కాంగ్రెస్  నుంచి మహబూబ్​నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని డీకే అరుణ చెప్పారని, ఈ విషయంపై ఏ రామ మందిరానికి రమ్మన్నా వస్తానని ఆయన ఇటీవల సవాల్​ విసిరారు. ఈ మేరకు చెప్పినట్లుగానే వంశీ ఆదివారం మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని రామాలయానికి మహబూబ్​నగర్, మక్తల్​ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, శ్రీహరితో కలిసి చేరుకున్నారు. ముందుగా రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం శ్రీరాముని సాక్షిగా ప్రమాణం చేసి డీకే అరుణ 2019లో ఎంపీ అభ్యర్థిగా నిలబడడానికి కాంగ్రెస్  పార్టీని రూ.15 కోట్లు డిమాండ్ చేసింది వాస్తవమేనని చెప్పారు. తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. అరుణ సవాల్​ చేసినట్లుగా తేదీని నిర్ణయించడానికి ఆమెకు తాను ఫోన్ చేయగా రిసీవ్​ చేసుకోలేదన్నారు. ఉదయం 11 గంటలకు తాను సీతారామచంద్ర స్వామి (రామాలయానికి) ఆలయానికి వెళ్లి అరుణ కోసం ఎదురు చూశానని పేర్కొన్నారు. పాలమూరు ప్రజలకు నిజం, నిజాయితీ ఎటు వైపు ఉన్నాయో స్పష్టంగా తెలుసన్నారు. ప్రమాణం చేయడానికి ఆమె ఎందుకు రాలేదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని రాముడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. రాముడి కన్నా ఎవరూ గొప్ప కాదని, ఎవరు నిజాయితిపరులో తేలడానికి రాముడి సమక్షంలో ప్రమాణం చేయాలని సవాల్  చేశారు.

అరుణ కౌంటర్​ అటాక్​

వంశీ కామెంట్లపై డీకే అరుణ స్పందించారు. రాజకీయాలు చేయడానికి తన పేరు వాడుకుంటున్నారని, ప్రజలు ఆయనను గుర్తు పెట్టుకోవడానికి తన గురించి మాట్లాడుతున్నారని ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్​మీట్​లో అరుణ చెప్పారు. అందువల్లే తనపై అదేపనిగా కామెంట్లు​ చేస్తున్నారని విమర్శించారు. ‘‘చాలా మంది కాంగ్రెస్​ పెద్దల పేర్లు చెబుతున్నారు. వారందరినీ ఏ గుడికి, ఎప్పుడు, ఏ డేట్​కు తీసుకొస్తావో చెప్పు? డేట్, టెంపుల్​ను నన్ను ఫిక్స్​ చేయమన్నా సరే. వాళ్లతో ప్రమాణం చేయిస్తావా? నేను కూడా ప్రమాణం చేస్తా. నేను ప్రమాణం చేస్తే మీరందరూ రాజకీయ సన్యానం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా?” అని అరుణ ప్రతి సవాల్  చేశారు.

రాజకీయ సన్యాయం అనేది వంశీ చంద్  రెడ్డికి అలవాటైందని ది. కానీ, ఆయన చెప్పిన కాంగ్రెస్​ లీడర్లందరూ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, ప్రమాణం చేయాడానికి తాను కూడా సిద్ధం అని ఆమె స్పష్టం చేశారు. కాగా, ఆదివారం ఉదయం కాంగ్రెస్​ లీడర్లు రామాలయానికి వెళ్లిన తర్వాత సాయంత్రం బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ లీడర్లు రామాలయాన్ని శుద్ధి చేశారు.