దేశంలోనే ఎక్కువ పోల్​ హింస జరిగిన రాష్ట్రంగా బెంగాల్

దేశంలోనే ఎక్కువ పోల్​ హింస జరిగిన రాష్ట్రంగా బెంగాల్
  • ఆరు ఫేజుల్లో వందలాది ఘర్షణలు..
  • పదుల సంఖ్యలో హత్యలు
  • ఏడో ఫేజ్ లో వయలెన్స్ ఇంకా పెరిగే అవకాశం

కోల్​కతా: ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషిన్ల (ఈవీఎంల) రాక, మిలీనియం తర్వాత చోటుచేసుకున్న సామాజిక మార్పుల కారణంగా ఇండియాలో ఎన్నికల హింస క్రమంగా తగ్గుతూ వచ్చింది. రిగ్గింగ్​, బూత్​ క్యాప్చరింగ్​ లాంటివి పోయి ట్యాంపరింగ్​, మ్యానుపులేషన్​ లాంటి పదాలు వాడుకలోకి వచ్చాయి. ఒకప్పుడు ఎన్నికలంటేనే గజగజలాడిన బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ ఇప్పుడు పోలింగ్​ దాదాపు ప్రశాంతంగా సాగుతున్నది. దేశమంతా ఒకదిక్కుకు పోతుంటే, వెస్ట్​బెంగాల్ మాత్రం రివర్స్​లో ప్రయాణిస్తున్నది. ఎన్నికల హింసకు ఆ రాష్ట్రం కేరాఫ్​గా మారింది. అన్ని పార్టీలూ హింసను ప్రత్యర్థులపై ఆయుధంగా, గెలుపునిచ్చే సాధనంగా వాడుకుంటున్నాయి. ఆరు దశల్లో పోలింగ్​ జరిగిన తీరే అందుకు నిదర్శనం. చివరిదైన ఏడో దశలో హింస  తీవ్రతరం కానున్నట్లు సోమ, మంగళవారాల్లో జరిగిన ఘటనలు నిరూపించాయి. ఒకప్పుడు దేశరాజధానిగా, సాంస్కృతిక సారధిగా, విప్లవోద్యమాల గడ్డగా పేరుపొందిన వెస్ట్​ బెంగాల్​లో ఇప్పుడు కొనసాగుతున్న ఎన్నికల హింసను పరిశీలిస్తే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ మొదటి నుంచీ కండబలాన్ని నమ్ముతూ, దాన్ని కాపాడుకుంటూనే వస్తున్నది.

ఎన్నికల ప్రచారమంతా ‘ప్రో మోడీ’, ‘యాంటీ మోడీ’ అనే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నది. బడా నేతలు మాటల యుద్ధం చేస్తుంటే, సాధారణ కార్యకర్తల్లో కొంత మంది మాత్రం కీలకమైన పోలింగ్​ రోజున జరిగే హింసలో పాలుపంచుకుంటున్నారు. వెస్ట్​బెంగాల్​లో పోటీ పడుతున్న అన్ని పార్టీలూ తీవ్రనిరాశలో కొట్టుమిట్టాడుతుండటమే హింస పెరగడానికి కారణమని విశ్లేషకుల భావన. ఎట్టిపరిస్థితుల్లోనూ బెంగాల్​లో బీజేపీకి అవకాశం ఇవ్వొద్దనుకుంటున్న తృణమూల్​ పార్టీ, కేంద్ర బలగాలు మోహరించి ఉన్నా, ప్రత్యర్థి పార్టీకి చెందినవానిని ఓటేయకుండా అడ్డుకోవడంలో, ప్రత్యర్థి నేతలు ప్రచారం నిర్వహించకుండా నిలువరించడంలో ముందుంది. బహిరంగ సభలే కాదు, కోల్​కతా సిటీలోని హోటల్స్​,  ప్రైవేటు ప్లేసుల్లోనూ మీటింగ్​లు పెట్టకుండా బీజేపీని అడ్డుకుంది. సరిగ్గా కాషాయ దళం కూడా ఇదే స్ట్రాటజీని రివర్స్​లో ప్లే చేస్తున్నది. దీదీ అనుసరించిన ఎత్తుగడలనే బీజేపీ నేతలూ వాడుకుంటున్నారు.

యూపీ దెబ్బకు బెంగాలే మందంటున్న బీజేపీ

సౌత్​ ఇండియాలో బీజేపీకి అంతగా ఆదరణలేదు. హార్ట్​ ల్యాండైన హిందీ బెల్టులో ఈసారి ఎక్కువ సీట్లు కోల్పోయే ప్రమాదంలో పడింది. యూపీలో తగిలే దెబ్బకు సరైన మందు బెంగాల్​లో గెలుపేనని ఆ పార్టీ నమ్మకం. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్​ అమిత్​ షా ఒడిశాతోపాటు బెంగాల్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఎన్నికల అంకం చివరి దశలో సీన్​ను ‘మోడీ వర్సెస్​ దీదీ’గా మార్చేయడం కూడా బీజేపీ వ్యూహంలో భాగమే. బెంగాల్​ చుట్టుపక్కలున్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. బెంగాల్​లో తమ హెలిక్యాప్టర్ల ల్యాండింగ్​కు అనుమతి లభించనప్పుడల్లా బీజేపీ నేతలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల గుండా రాకపోకలు సాగిస్తున్నారు. దీదీ ఎంత ప్రెజర్​ పెడితే అంతే గట్టిగా బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆధిపత్య యుద్ధంలో, హింస, అణిచివేత.. సులువుగా వాడగల సాధనాలుగా మారాయి. రెండు పార్టీలు కూడా పోల్​ ఎథిక్స్​, ఈసీ వార్నింగ్స్.. లాంటివాటిని లెక్కచేయడంలేదు.

కండబలాన్నీ నమ్మే దీదీ

కాంగ్రెస్​ నుంచి విడిపోయి, మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్​ పార్టీ మూలసిద్ధాంతాల్లో జాతీయ దృక్పథం ఉన్నా, వెస్ట్​ బెంగాల్​కే పరిమితమైపోయింది. సరిగ్గా సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిపోతున్న దశలో టీఎంసీ పురుడుపోసుకుంది.‘‘విధేయత చూపండి.. కావాల్సినవి పొందండి”అనే మోడల్​ ఆ పార్టీ పెరగడానికి సాయపడింది. ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ బలపడొద్దన్నది మమత ఆలోచన. బెంగాల్​లో అధికారం కోల్పోతే, దేశవ్యాప్తంగా దీదీకి ఉన్న ఇమేజ్​ కూడా దెబ్బతినడం ఖాయం. పార్టీని నడిపించడానికి నిధులు కూడా కరువయ్యే పరిస్థితి తలెత్తుతుంది. నాడు లెఫ్ట్​ పార్టీని ఢీకొట్టే క్రమంలో అనుసరించిన వ్యూహాత్మక ఎత్తుగడలుకానీ,  అవినీతిపై పోరాడే విషయంలోగానీ టీఎంసీ తన పాత ‘రెబల్​’ క్యారెక్టర్​ను దాదాపు వదిలేసుకున్నది. నిలవాలంటే గెలవక తప్పని పరిస్థితులే టీఎంసీ హింసను నమ్ముకునేలా చేశాయి. బెంగాల్​లో ఇంతకుముందు అధికారం చెలాయించిన సీపీఎం కూడా ఇలాంటి హింసాత్మక వైఖరినే అనుసరించినట్లు ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటారు. అధికార పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి మధ్య  ఉండే సున్నితమైన పొర చినిగిపోయింది మార్క్సిస్టుల పాలనలోనే అని విశ్లేషకులు చెబుతారు.

అమిత్ షా రోడ్ షో.. భగ్గుమన్న కోల్ కతా

లోక్ సభ ఎన్ని కల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం కోల్ కతాలో నిర్వహించిన రోడ్ షో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీ జరిగిన ఏరియాలో జై శ్రీరాం నినాదాలు చేయడంతో బీజేపీ కార్యకర్తలతో టీఎంసీ కార్యకర్తలు గొడవ పడ్డారు .. దాడులు చేసుకున్నారు .రోడ్డు పక్కనున్న వాహనాలు, దుకాణాలకు నిప్పుపెట్టారు . కోల్ కతా వర్సిటీ వద్ద టీఎంసీ, సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘాలు ‘గో బ్యాక్ అమిత్ షా’ నినాదాలు రాసున్న ప్లకార్డులతో నిరసన చేపట్టారు . బిధాన సరాయి ఏరియా వద్ద టీఎంసీ కార్యకర్తలు .. షా కాన్వాయ్ పైకి రాళ్లు, కర్రలు విసిరారు. అప్రమత్తమైన పోలీసులు లా ఠీచార్జి జరిపారు. రోడ్ షో ముగిసిన తర్వాత షా ప్రయాణించిన మార్గం వెంబడి పలు చోట్ల వాహనాలు, దుకాణాలు దగ్ధమయ్యాయి. అంతకు ముందు షా కు స్వాగతం పలుకుతూ బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను టీఎంసీ కా ర్యకర్తలు చించేయడం వివాదానికి దారి-తీసింది. మమతా బె నర్జీ పాలనలో బెంగాల్ హింస కేంద్రంగా మారిందని, ఓటమి భయంతోనే ప్రతిపక్షనేతల ప్రచారాన్ని ఆమె అడ్డుకుంటున్నారని అమిత్ షా ఆరోపించారు.