పార్లమెంట్లో ఓటేసిన 719 మంది ఎంపీలు

పార్లమెంట్లో ఓటేసిన 719 మంది ఎంపీలు

న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం పోలింగ్ పూర్తయింది. ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో, ఎంపీలు పార్లమెంటులో ఓటు వేశారు. ఎంపీల కోసం ఢిల్లీలోని పార్లమెంటు రూమ్‌‌ నంబర్ 63లో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ నిర్వహించారు. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ, తర్వాత జేపీ నడ్డా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర ప్రముఖులు ఓటేశారు. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈ నెల 21న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.

అక్కడక్కడా క్రాస్ ఓటింగ్
రాష్ట్రపతి ఎన్నికల్లో అక్కడక్కడా క్రాస్ ఓటింగ్ నమోదైంది. పార్టీ మద్దతిస్తున్న క్యాండిడేట్‌‌కు కాకుండా కొందరు ప్రజాప్రతినిధులు వేరే అభ్యర్థికి ఓటేశారు. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్‌‌దీప్ బిష్ణోయ్.. ముర్ముకు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్ ఎన్సీపీ ఎమ్మెల్యే కమ్లేశ్ సింగ్ కూడా ముర్ముకే ఓటేశారు. అకాళీదళ్ ఎమ్మెల్యే మన్‌‌ప్రీత్ సింగ్ మాత్రం ఈ ఎన్నికను బాయ్‌‌కాట్ చేశారు. 

ఓటు విలువ తగ్గింది..
ఈ ఎన్నికలో ఎంపీల ఓటు విలువ కాస్త తగ్గింది. మొన్నటిదాకా ఒక్కో పార్లమెంటు మెంబర్ ఓటు విలువ 708గా ఉండగా.. ఇప్పుడు 700కి తగ్గింది. జమ్మూకాశ్మీర్ శాసన సభ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడంతో ఈ సారికి ఇలా మార్పు చేశారు.

యూపీ ఎమ్మెల్యేలదే పెద్ద ఓటు
రాష్ట్రాలను బట్టి ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది. ఎక్కువ మంది శాసన సభ్యులున్న యూపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు వ్యాల్యూ 208. దేశంలో ఇదే అత్యధికం. తర్వాత జార్ఖండ్‌‌, తమిళనాడులో 176, మహారాష్ట్రలో 175గా ఉంది. అతి తక్కువగా సిక్కింలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 7 మాత్రమే. మిజోరంలో 8, నాగాలాండ్‌‌లో 9గా ఉంది. 

పార్లమెంట్‌‌లో 99 శాతం ఓటింగ్
దేశవ్యాప్తంగా 4,800 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అర్హులు. నామినేటైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు ఓటు వేసే అవకాశం లేదు. పార్లమెంటు హౌస్‌‌లో 98.9 శాతం ఓట్లు పడ్డట్లు రిటర్నింగ్ ఆఫీసర్ పీసీ మోడీ చెప్పారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు 727 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలకు పర్మిషన్ ఇవ్వగా.. మొత్తం 728 మంది (719 మంది ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పార్లమెంటులో ఓటేసిన రాష్ట్ర ఎంపీలు
పార్లమెంట్‌‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఓటు వేశారు. లోక్‌‌సభ, రాజ్యసభకు చెందిన 12 మంది టీఆర్ఎస్ సభ్యులు కలిసిగట్టుగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్వింద్, సోయం బాపురావు, లక్ష్మణ్.. కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌‌రెడ్డి కూడా ఓటు వేశారు.