నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నాలుగేండ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • దేశానికి రోల్ మోడల్ భూభారతి 
  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు

నల్గొండ, వెలుగు  :  రాష్ట్రంలో  రాబోయే నాలుగేండ్లలో పేదలకు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లా నకిరేకల్ ఎంపీడీవో ఆఫీస్ లో  నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. 

విడతలవారీగా అర్హులకు ఇండ్లు ఇస్తామన్నారు. తెలంగాణలోని భూ సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్ కానుందని మంత్రి తెలిపారు. వచ్చే జూన్ 2 నుంచి  ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో 45 శాతం ఇండ్లకు మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, తాము వచ్చాక రూ.650 కోట్లు ఖర్చు చేసి అందిస్తున్నామన్నారు. రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే  ఏడాదిన్నరలోనే కూలిపోయిందని విమర్శించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులు పాల్గొన్నారు. 

భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం

నల్గొండ, వెలుగు : పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆపరేషన్  సిందూర్ తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందని మంత్రి పొంగులేటి  అన్నారు.  నకిరేకల్ పీఎస్ నుంచి  ఎంపీడీవో ఆఫీస్ వరకు భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.