ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తా! : పొంగులేటి

ఏ పార్టీలో చేరబోయేది త్వరలో ప్రకటిస్తా! : పొంగులేటి

వెంకటాపురం, వెలుగు : తాను ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం భద్రాచలం నియోజకవర్గం పరిధిలో ఉన్న ములుగు జిల్లాలోని వెంకటాపురం వాజేడు మండలాల్లో ఆయన పర్యటించారు. గతవారం భద్రాచలంలో తన అనుచరుడు తెల్లం వెంకట్రావును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఆయన ఈ రెండు మండలాల్లోని ముఖ్య కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నూతన రాజకీయలకు శ్రీకారం చుట్టబోతున్నానని, ఏ రాజకీయ పార్టీలో చేరబోయేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. 

పార్టీ ఏదైనా తెల్లం వెంకట్రావును భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు. వాజేడులో అధికార పార్టీకి చెందిన ఎంపీపీ శ్యామల శారద, జడ్పీటీసీ తల్లాడి పుష్పలత పొంగులేటికి  మద్దతు పలికారు. వెంకటాపురం మండలంలోని కాంగ్రెస్ నాయకులు మన్యం సునీల్ ఇంటి దగ్గర వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, చిడెం సాంబశివరావులతో పొంగులేటి సమావేశమయ్యారు.  ఈ కార్యక్రమాల్లో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే  కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పొంగులేటి ముఖ్య అనుచరుడు, బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ ఇన్​చార్జ్  డాక్టర్ తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, రామాచారి, ప్రసాద్ రాజు పాల్గొన్నారు.