అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేస్తా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేస్తా : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కూసుమంచి, వెలుగు :  పాలేరు నియోజకవర్గంలో తనను ఆశీర్వదించాలని, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే ప్రజల వద్దకే అధికారులను వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చేస్తానని పాలేరు కాంగ్రెస్​ నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సోమవారం తిరుమలాయపాలెం మండలంలోని రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయి పేట, జల్లేపల్లితోపాటు ఆయా గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బాగుపడింది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని ఆరోపించారు. ఇది గమనించి ప్రజలు కాంగ్రెస్​ను ఆదరించాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు అనేక పథకాలను అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పొంగులేటితో పాటు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, బెల్లం శ్రీను, రామసహాయం నరేశ్​రెడ్డి, చావా శివరామకృష్ణ, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ ఉన్నారు. 

100కు పైగా కుటుంబాలు చేరిక

కూసుమంచి  మండలంలోని గైగోళ్లపల్లి, చింతలతండా గ్రామాలకు చెందిన 100కు పైగా కుటుంబాలు మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు ఆధ్వర్యంలో  బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి పొంగులేటి తన క్యాంపు ఆఫీస్​లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.