ఎస్సారెస్పీ నుంచి చివరి ఆయకట్టుకూ నీళ్లిస్తాం: మంత్రి పొన్నం

ఎస్సారెస్పీ నుంచి చివరి ఆయకట్టుకూ నీళ్లిస్తాం: మంత్రి పొన్నం
  •     ఎస్సారెస్పీ నుంచి చివరి ఆయకట్టుకూ నీళ్లిస్తాం
  •     యాసంగిలో ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలి
  •     ప్రజాపాలనలో ఏ సమస్యపై అయినా దరఖాస్తు చేసుకోవచ్చు 
  •     రవాణా శాఖ మంత్రి పొన్నం

తిమ్మాపూర్, వెలుగు: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీ రిజర్వాయర్ లోకి నీటిని తీసుకువచ్చి చివరి ఆయకట్టు రైతులకు అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ ​మండలంలోని ఎల్ఎండీ కాలనీలో ప్రధాన కాకతీయ కాలువ గేట్ల వద్ద పూజలు నిర్వహించిన మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఎండీ నుంచి హుజూరాబాద్ కు, ​అక్కడి నుంచి సూర్యాపేట వరకు యాసంగి పంటలకు నీటిని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎల్ఎండీలో 19 టీఎంసీలు ఉన్నాయని, అలాగే మిడ్​మానేరులో 23 టీఎంసీలు ఉన్నాయన్నారు. 

ఎల్​ఎండీలో 7 టీఎంసీలు మిడ్​మానేరులో 8 టీఎంసీలను తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచుకుని మిగతా 27 టీఎంసీలను దిగువకు విడుదల చేస్తామన్నారు.  ప్రస్తుతం కాకతీయ కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ క్రమంగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్​చేస్తామన్నారు. రైతులకు నిరంతరంగా నీరందించాలంటే యాసంగిలో ఆరుతడి పంటలు వేయాలన్నారు. వరిపై ఆధారపడకుండా ఇతరత్రా పంటలపై దృష్టి సారించాలన్నారు. డీబీఎం 54 ద్వారా 3.98 లక్షల ఎకరాలు,71 డీబీఎం ద్వారా 5.01 లక్షల ఎకరాలకు నీటిని అందించనున్నామన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ శంకర్, ఎస్సీ శివకుమార్, ఈఈ నాగభూషణం, నాయకులు శ్రీగిరి రంగారావు, కొత్త తిరుపతిరెడ్డి, కనకయ్య, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

భూమి సేకరణ కోసం రూ.200 కోట్లు అవసరం

సిద్దిపేట జిల్లా గౌరవెల్లి ప్రాజెక్టు, తోటపల్లి రిజర్వాయర్లలో నీటిని నిల్వ ఉంచుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు, కాలువల నిర్మాణానికి సుమారు 2000 ఎకరాల భూమి అవసరముంటుందని, ఆ భూమి సేకరణ కోసం రూ.200 కోట్లు కావాల్సి ఉందన్నారు. భూసేకరణ కోసం ఇప్పటికే సిద్దిపేట 
కలెక్టర్ ను ఆదేశించామన్నారు. 

కుటుంబంలో ఎంతమందైనా అప్లై చేసుకోవచ్చు 

ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలనలో కుటుంబంలో ఎంతమందైనా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్​చెప్పారు. ఆరు గ్యారంటీలతో పాటు కుటుంబంలో ఏ సమస్య ఉన్నా దరఖాస్తుతో పాటు రాసి ఇస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేకున్నా అప్లై చేసుకోవచ్చని, తిరస్కరిస్తే సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.