అలంపూర్ లో హెల్త్​ డిపార్ట్​మెంట్ గాడిలో పడేనా?

అలంపూర్ లో హెల్త్​ డిపార్ట్​మెంట్ గాడిలో పడేనా?
  •  16 నెలలుగా జోగులాంబ జిల్లాకు ఇన్​చార్జి డీఎంహెచ్ వోనే గతి
  • అలంపూర్ లో 100 బెడ్స్  హాస్పిటల్  ఓపెన్  చేసి వదిలేసిన్రు
  • జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలందక  కర్నూల్, హైదరాబాద్ కు పేషెంట్లు

గద్వాల, వెలుగు: పేదలకు సర్కార్  వైద్యం సరిగా అందడం లేదు. 16 నెలలుగా గద్వాల జిల్లాకు ఇన్​చార్జి డీఎంహెచ్​వోను కొనసాగిస్తున్నారు. అలంపూర్ లో 100 బెడ్స్  హాస్పిటల్ ను ఎన్నికల ముందు హడావుడిగా ఓపెన్  చేసినప్పటికీ సిబ్బందిని నియమించలేదు. గద్వాల సర్కార్  దవాఖానతో పాటు మండల కేంద్రాల్లోని పీహెచ్​సీలు, యూపీహెచ్ సీలపై పర్యవేక్షణ లేకపోవడం పేద రోగులకు శాపంగా మారుతోంది. 

నార్మల్  డెలివరీలు, ఫస్ట్  ఎయిడ్  తప్ప మెరుగైన వైద్యం అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఏదైనా చిన్న సమస్య ఉన్నా, చివరికి కుక్కకాటు రోగులను కూడా గద్వాల్  ఆసుపత్రికి పంపిస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోనూ సరైన వైద్యం అందడం లేదని, ప్రతి చిన్న విషయానికి కర్నూల్  హాస్పిటల్ కు రెఫర్  చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. ఇక్కడ స్కానింగ్  చేయకపోవడంతో బయట స్కానింగ్, ఇతర టెస్టులు చేసుకొని డాక్టర్లతో మందులు రాయించుకోవాల్సిన పరిస్థితి ఉంది.

ప్రారంభించి వదిలేసిన్రు..

అలంపూర్ చౌరస్తాలో అందరికీ అందుబాటులో ఉండేలా 100 బెడ్స్  హాస్పిటల్ ను ఎన్నికలు దగ్గర పడుతుండడంతో హడావుడిగా ప్రారంభించారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో మూతపడి ఉంది. ఎన్నికల సమయంలో స్పెషల్  ఫోర్స్  ఉండడానికి పనికి వచ్చిందే తప్ప, పేదలకు వైద్యం అందడం లేదు. డాక్టర్లు, సిబ్బందిని నియమించకుండా ఆసుపత్రిని ఎలా ప్రారంభించారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

డీఎంహెచ్​వో పోస్టు ఖాళీ..

గద్వాల డీఎంహెచ్​వో పోస్టు 16 నెలలుగా ఖాళీగా ఉంది. అప్పటినుంచి ఇన్​చార్జి డీఎంహెచ్​వోగా డాక్టర్  శశికళ కొనసాగుతున్నారు. 10 పీహెచ్ సీలు, 3 అర్బన్​ ప్రైమరీ హెల్త్​ సెంటర్లు ఉన్నాయి. ఏడుగురు రెగ్యులర్  డాక్టర్లు ఉండగా,  మిగిలిన చోట్ల ఇన్ చార్జి డాక్టర్లతో వైద్య సేవలు అందిస్తున్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన హాస్పిటల్లో సైతం డాక్టర్లు సరిగా లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు.

స్కానింగ్ లు చేస్తలేరు..

గద్వాల సర్కార్  దవాఖానలో రూ. కోట్లు ఖర్చు మెషీన్లు తెప్పించినప్పటికీ డాక్టర్లు లేరనే కారణంతో టెస్టులు చేయట్లేదు. టీ హబ్ లో కూడా కొంతకాలంగా టెస్ట్ లు చేయడం లేదని రోగులు వాపోతున్నారు. కొన్ని టెస్టులు చేసి మిగిలిన వాటికి బయటకి పంపిస్తున్నారు. టీ హబ్  కింద 250 పైగా టెస్టులు చేయాల్సి ఉండగా, 20 టెస్టులు మాత్రమే చేసి, మిగిలిన టెస్టులకు బయటకు పంపిస్తున్నారని అంటున్నారు. స్కానింగ్ లు, ఎలక్ట్రోలైట్స్  టెస్ట్ లు చేయడం లేదు. ఇక గద్వాల ఆసుపత్రిలో ఈఎన్టీ, స్కిన్  తదితర స్పెషలిస్ట్  డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మెరుగైన వైద్యం అందిస్తాం..

గవర్నమెంట్  హాస్పిటళ్లలో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ముగ్గురు డాక్టర్ల నియామకం కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్​ పంపించాం. 124 జీవో కింద రెగ్యులర్  డీఎంఅండ్ హెచ్ వో రావాల్సి ఉంది. ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం.

 డాక్టర్ శశికళ, ఇన్ చార్జి డీఎంహెచ్ వో