డబుల్ ఇండ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు

డబుల్ ఇండ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు

వర్ని, వెలుగు : అధికార పార్టీకి చెందిన వారికే డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లు ఇస్తున్నారని, అర్హులైన తమకు ఇవ్వడం లేదని శుక్రవారం వర్ని మండలంలోని పాతవర్నీకి చెందిన నిరుపేదలు ‘డబుల్’ ఇండ్ల తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. బలవంతంగా బయటకు పంపిస్తే పురుగుల మందు తాగి చస్తామని, పెట్రోల్​ పోసుకుని కాలపెట్టుకుంటామని హెచ్చరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాతవర్నీలో 40 డబుల్‌‌ ‌‌బెడ్‌‌‌‌రూం ఇండ్లను నిర్మించగా, ఈ నెల11న స్పీకర్‌‌‌‌ పోచారం శ్రీనివాస్‌‌‌‌రెడ్డి  ప్రారంభించారు.

అయితే టీఆర్ఎస్​ లీడర్ల సంబంధీకులకు మాత్రమే ఈ ఇండ్లను కేటాయించారని, నిరుపేదలమైన తమకు రాలేదని  మూడు కుటుంబాలకు చెందిన వారు శుక్రవారం మధ్యాహ్నం డబుల్​ఇండ్ల తాళాలు పగలగొట్టారు. వెంట పురుగుల మందు డబ్బాలు, పెట్రోల్​క్యాన్లను తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమచారమిచ్చారు. దీంతో కోటగిరి, రుద్రూర్‌‌‌‌, వర్ని ఎస్ఐలు అక్కడికి వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో బలవంతంగా బయటకు పంపాలని చూశారు. అయితే దగ్గరకు వస్తే పురుగుల మందు తాగి చస్తామని, పెట్రోల్​పోసుకుని అగ్గి పెట్టుకుంటామని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. తహసీల్దార్‌‌‌‌ విఠల్‌‌‌‌, కొందరు ఆఫీసర్లు వచ్చి వారితో మాట్లాడారు. నిజంగా అర్హులు ఉంటే తప్పకుండా డబుల్‌‌ ‌‌బెడ్‌‌‌‌రూం ఇండ్లు కేటాయించేలా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.