బైక్.. అందులోనూ స్పోర్ట్స్ బైక్.. యంగ్ కుర్రోడు.. దీనికితోడు జాతీయ రహదారి.. వేగానికి హద్దే ఉండదు.. ఇలాంటి ప్రయోగమే చేసి.. ప్రముఖ బైక్ రేసింగ్ యూట్యూబర్ అగస్త్య చౌహాన్ చనిపోయాడు. దేశ మొత్తం షాక్ అయిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఔరా అని నోరెళ్లబెడతారు..
అగస్త్య చౌహాన్.. బైక్ రేసింగ్ గురించి.. స్పోర్ట్స్ బైక్స్ గురించి తన యూట్యూబ్ చానెల్ ప్రో రైడర్ 1000 ద్వారా ఆసక్తికర విషయాలు చెబుతూ ఉంటాడు. మార్కెట్ లోకి ఏ బైక్ వచ్చినా.. కుర్రోళ్లు అందరూ ఆగస్త్య చెప్పే విషయాలపై ఆసక్తిచూపిస్తారు. రెగ్యులర్ గా తన స్పోర్ట్స్ బైక్స్ తో రైడింగ్స్ చేసే అగస్త్య.. లేటెస్ట్ గా.. తన కావాసాకీ నిన్జా బైక్ పై.. ఆగ్రా – ఢిల్లీ మధ్య యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై.. 300 కిలోమీటర్ల స్పీడ్ తో బైక్ రైడ్ చేయాలని నిర్ణయించాడు. ఇందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని.. 2023, మే 3వ తేదీ బుధవారం రైడ్ కు బయలుదేరాడు.
బుల్లెట్ రైలు స్పీడ్ లో.. బైక్ నడపాలనే ఉత్సాహంతో.. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై దూసుకెళుతుండగా.. బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో అగస్త్య తలకు పెట్టుకుని హెల్మెట్ ముక్కలైంది.. బైక్ ఎగిరి పడింది. రోడ్డుకు తల బలంగా కొట్టుకోవటంతో స్పాట్ లో చనిపోయాడు అగస్త్య చౌహాన్. యాక్సిడెంట్ సమయంలో.. తన బైక్ స్పీడ్ 258 కిలోమీటర్లుగా ఉంది. ఇంత స్పీడ్ లో బైక్ వెళ్లటం అంటే.. బుల్లెట్ రైలుతో పోటీ పడటమే అంటున్నారు నిపుణులు. యమునా ఎక్స్ ప్రెస్ హైవేలో అలీగఢ్ జిల్లా తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. 47వ కిలోమీటర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆస్పత్రికి తరలించారు.
వంద స్పీడ్ అంటేనే బండి షేక్ అవుతుంది.. అలాంటిది 258 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపటం ఒకటి అయితే.. 300 కిలోమీటర్లను టచ్ చేయాలనే లక్ష్యంతో.. అగస్త్య చౌహాన్ ను తిరిగిరాని లోకానికి తీసుకెళ్లింది. బండి నడిపే సమయంలో స్పీడ్ రికార్డ్ కోసం కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు.. యాక్సిడెంట్ సమయంలో 258 కిలోమీటర్లుగా రికార్డ్ అయ్యింది.. అగస్త్య లేడనే విషయంలో బైక్ రేసర్లను షాక్ కు గురిచేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. ఇలాంటి ప్రయోగమే గతంలో చేస్తుండగా.. పోలీసులు కేసులు పెట్టి.. వార్నింగ్ ఇచ్చారు. అయినా అగస్త్య అవేవీ పట్టించుకోకుండా.. ఇప్పుడు కొత్త ప్రయోగం చేస్తూ.. ప్రాణాలు కోల్పోయాడు..