పోర్న్ భూతం అంతానికి ఉమ్మడి కృషి అవసరం

పోర్న్ భూతం అంతానికి ఉమ్మడి కృషి అవసరం

సమాజానికి పోర్నోగ్రఫీ చేసే కీడును దేశమంతా అర్థం చేసుకోవాలని అన్నారు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ పెను భూతంలా పరిణమిస్తోందని, ఇంటర్నెట్‌లో దీని నియంత్రణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాల పోలీసులు కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ బుధవారం సోషల్ మీడియాలో పోర్నోగ్రఫీ, ఫేక్ వార్తలపై ప్రశ్నించారు.

ఏవైనా ఫేక్ న్యూస్‌లు లేదా చైల్డ్ పోర్నోగ్రఫీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితే గుర్తించేందుకు ఏదైనా మెకానిజం ఉందా? ఉంటే ఎన్ని కేసులను గుర్తించి శిక్షించారని అడిగారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. పోర్న్ అనేది పెను భూతమన్నారు. దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సీరియస్‌గా పనిచేస్తున్నామన్నారు.

చైల్డ్ పోర్నోగ్రఫీని సర్క్యులేట్ చేసేందుకు సోషల్ మీడియాను వినియోగించడాన్ని నిరోధించడానికి తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రవిశంకర్ ప్రసాద్. పోర్న్ వల్ల జరిగే చెడును దేశమంతా అర్థం చేసుకోవాలని అన్నారాయన. దేశంలో రివేంజ్ పోర్న్ పెరుగుతోందన్నారు. ఈ పోర్న్‌ నియంత్రించడానికి సమాజం, దేశం, రాజకీయాలు, పార్లమెంట్ సమష్టిగా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.