
- యోగాతో పాజిటివ్ మార్పు
- ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తిమంతమైన సాధనం: ప్రధాని
- శ్రీనగర్‌లో యోగా డే సెలబ్రేషన్స్‌కు హాజరు
- విదేశాల్లో యోగా పాపులర్ అవుతోంది
- దేశంలో యోగా టూరిజం పెరుగుతోంది
- కొత్త ఉపాధి అవకాశాలు వస్తున్నయ్
- యోగాతో జమ్మూకాశ్మీర్ కు టూరిస్టులు పెరుగుతరు
- ఎకానమీ గ్రోత్ కు దోహదం చేస్తుందని వెల్లడి
శ్రీనగర్/న్యూఢిల్లీ: సమాజంలో సానుకూల మార్పు దిశగా యోగా కొత్త దారులు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచానికి మంచి జరిగేలా చేయడంలో యోగా ఒక శక్తిమంతమైన సాధనమని అన్ని దేశాలు గుర్తించాయని చెప్పారు. దేశంలో యోగా టూరిజం క్రమంగా పెరుగుతోందని, ఇది జమ్మూకాశ్మీర్‌కు మరింత పెద్ద ఎత్తున టూరిస్టులను ఆకర్షించి ఎకానమీ గ్రోత్‌కు దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యోగా డే వేడుకల్లో మోదీ పాల్గొన్నారు.
వందలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం గతానికి సంబంధించిన భారాన్ని వదిలేసి వర్తమానంలోనే జీవించేలా యోగా సహాయం చేస్తుంది. మనం లోలోపల ప్రశాంతంగా ఉంటే.. ప్రపంచంపైనా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలం. సమాజంలో పాజిటివ్ మార్పు దిశగా యోగా కొత్త దారులు వేస్తోంది” అని తెలిపారు. ‘‘యోగా అంటే.. అల్లా, ఈశ్వరుడు లేదా దేవుడిని చేరుకునేందుకు ఉపయోగపడే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమేనని చాలా మంది అనుకుంటారు.
కానీ ఆధ్యాత్మిక ప్రయాణం జీవితంలో మున్ముందు ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు. ప్రస్తుతానికి మీరు వ్యక్తిగత అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టాలి. అందులో యోగా ఒక భాగం కావాలి. యోగా ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. వ్యక్తిగత అభివృద్ధి సమాజానికి మేలు చేస్తుంది. తద్వారా మొత్తం మానవాళికే ప్రయోజనం లభిస్తుంది” అని ప్రధాని చెప్పారు.
ఏ దేశానికెళ్లినా యోగాపై చర్చిస్తున్నరు..
ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ యోగా ప్రాక్టీస్ చేసేవారి సంఖ్య పెరుగుతోందని మోదీ చెప్పారు. తాను ఏ దేశానికి వెళ్లినా.. అక్కడి నేతలు యోగా ప్రయోజనాల గురించి ప్రస్తావిస్తుంటారని అన్నారు. ఇప్పుడు చాలా దేశాల్లో ప్రజల రోజువారీ జీవితాల్లో యోగా ఒక భాగం అవుతోందన్నారు. తుర్కుమెనిస్తాన్, సౌదీ, మంగోలియా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో యోగా ఎంతో పాపులర్ అయిందన్నారు.
అనేక సమస్యలకు యోగా పరిష్కారం
యోగా అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని మోదీ చెప్పారు. ‘‘ప్రస్తుత సమాచార విప్లవ యుగంలో సమాచార వనరులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఒక సబ్జెక్ట్ పై ఫోకస్ పెట్టాలంటే మానవ మెదడుకు పెద్ద సవాలుగా మారింది. కానీ యోగా చేస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కి ఏకాగ్రతను సాధించవచ్చు. అందుకే ఆర్మీ నుంచి స్పోర్ట్స్ దాకా యోగా ప్రాక్టీస్ పెరుగుతోంది. చివరకు అంతరిక్షంలోనూ పరిస్థితులను తట్టుకునేందుకు యోగా దోహదపడుతోంది” అని ప్రధాని తెలిపారు.
కాగా, శ్రీనగర్‌లోని దాల్ లేక్ వద్ద బహిరంగంగా యోగా డే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా.. వర్షం కారణంగా కన్వెన్షన్ సెంటర్ లోపల నిర్వహించారు. ఒకవైపు వర్షం పడుతున్నా.. స్టూడెంట్లు, మహిళలు, యువత పెద్ద ఎత్తున యోగా సెషన్ లో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. వర్షంలోనూ ఉత్సాహంతో యోగా చేసేందుకు వచ్చిన వారిని మోదీ అభినందించారు.
ఢిల్లీలోని ఎంబసీల్లో సెలబ్రేషన్స్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇండియాలోని వివిధ దేశాల ఎంబసీల ఆధ్వర్యంలో ఘనంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఢిల్లీలోని బ్రిటన్ హైకమిషన్, అమెరికా, ఇజ్రాయెల్, తదితర దేశాలకు చెందిన ఎంబసీల దౌత్యవేత్తలు, స్టాఫ్ వేడుకల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాసనాలు వేసిన సందర్భంగా ఫొటోలు, సెల్ఫీలు దిగి వాటిని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఉపాధి అవకాశాలు పెరుగుతున్నయ్..
దేశంలో యోగా టూరిజం పెరుగుతోందని ప్రధాని చెప్పారు. ప్రత్యేకంగా యోగా నేర్చుకునేందుకే అనేక దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నారన్నారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్, కేరళ రాష్ట్రాల్లో యోగా టూరిజం ఊపందుకున్నదని తెలిపారు. ప్రజలు వ్యక్తిగతంగా యోగా ట్రెయినర్లను పెట్టుకుంటు న్నారని, కంపెనీలు సైతం తమ ఉద్యోగులకు యోగా క్లాసులు ఇప్పిస్తున్నాయన్నారు.
దీనివల్ల కొత్త ఉపాధి అవకాశాలు కూడా వచ్చాయన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి యోగా టూరిజం కూడా కీలకం కానుందని ప్రధాని చెప్పారు. ‘‘నిన్నటి నుంచి చూస్తున్నా. శ్రీనగర్ తో సహా మిగతా జమ్మూకాశ్మీర్ అంతటా యోగా పాపులర్ అవుతోంది. దాదాపు 50 వేల నుంచి 60 వేల మంది యోగా ప్రాక్టీస్ చేస్తుండటం గొప్ప విషయం. యోగాతో ఇక్కడికి మరింత మంది టూరిస్టులు అట్రాక్ట్ అవుతారు.
తద్వారా స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈజిప్టులో సైతం యోగా టూరిజం పాపులర్ అయిందని మోదీ ప్రస్తావించారు. పిరమిడ్ లతో సహా చరిత్రాత్మక ప్రదేశాల్లో యోగా చేసి ఫొటోలు, వీడియోలు పంపాలంటూ ఆ దేశంలో ప్రత్యేక పోటీలు కూడా పెడుతున్నారన్నారు. కాశ్మీర్‌కు కూడా యోగాతో అలా టూరిస్టులను ఆకర్షించవచ్చని ప్రధాని మోదీ చెప్పారు.
మోదీ వల్లే 200 దేశాల్లో యోగా ప్రాక్టీస్: యోగి
ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రయత్నాల వల్లే ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు యోగా చేరువైందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యోగా డే సందర్భంగా శుక్రవారం లక్నోలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. యోగాను స్వీకరించడం ద్వారా ఆయా దేశాలు భారత సంస్కృతి, సంప్రదాయా లను గౌరవించాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో యోగా ప్రాక్టీస్ చేసి, దానితో అందే ఆరోగ్య, వ్యక్తిత్వ వికాస ప్రయోజనాలను పొందాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా...
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా యోగా కార్యక్రమాలునిర్వహించా రు. సింగపూర్‌లోని వాటర్ ఫ్రంట్ ప్లాజా వద్ద జరిగిన సెలబ్రేషన్స్‌లో ఆ దేశ మంత్రి రహాయు మహజామ్, ఇండియన్ హైకమిషనర్ షిల్పక్ అంబులేతో సహా 200 మంది యోగాసనాలు వేశారు.
– టోక్యో/సింగపూర్/న్యూయార్క్