కార్మిక హక్కులను కాలరాస్తున్రు : పోటు రంగారావు

కార్మిక హక్కులను కాలరాస్తున్రు : పోటు రంగారావు

వనపర్తి టౌన్, వెలుగు: కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా, హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్  ప్రజాపంథా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ( ఇఫ్టూ) రాష్ట్ర ప్రథమ మహాసభ రాష్ట్ర నాయకుడు పి.అరుణ్ కుమార్  అధ్యక్షతన నిర్వహించారు.  

ఈ సందర్భంగా పోటు రంగారావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 40 కోట్ల మంది అసంఘటితరంగ కార్మికులకు భద్రత లేకుండా పోయిందని, ఇది దేశ అభివృద్ధికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. పెట్టుబడిదారులకు వంత పాడుతున్న కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు బ్రిటీష్  కాలంలో తెచ్చిన చట్టాలు కూడా రద్దు చేయడం సరైంది కాదన్నారు. పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో దేశంలో అలజడులు సృష్టిస్తూ ప్రజలను విభజించి పాలించే రాజకీయానికి తెర లేపిందని విమర్శించారు.

ప్రజలు, కార్మిక వర్గం  తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో కార్మిక వర్గం, పేద ప్రజలపై  నియంతృత్వ వైఖరితో ఉన్న కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రజల తీర్పు వచ్చిందన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలు, డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కె సూర్యం, పద్మ, వెంకటేశ్, మధుసూదన్ రెడ్డి, వెంకన్న ప్రసాద్, జనజ్వాల, బోయినపల్లి గణేశ్, కురుమయ్య, సుబ్బయ్య,  గట్టమ్మ, గోవిందమ్మ పాల్గొన్నారు.