ఆస్పత్రిలో పవర్ కట్.. టార్చిలైట్ వెలుతురులో డెలివరీలు

ఆస్పత్రిలో పవర్ కట్.. టార్చిలైట్ వెలుతురులో డెలివరీలు
  • ఇన్వర్టర్లున్నా.. మరమ్మత్తులకు నోచుకోక మూలనపడ్డాయి
  • గండిపేట మండలం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి

హైదరాబాద్:  అన్ని సౌకర్యాలు.. సదుపాయాలున్న ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహణ లోపం అటు వైద్యులు, వారి సిబ్బంది మాత్రమే కాదు.. వైద్యం కోసం వచ్చే రోగులు సైతం ఇబ్బందులపాలవుతున్నారు. గత్యంతరం లేక సర్కారు దవాఖానాలో చేరిన వారు చికిత్స కోసం వైద్యుల దయాదాక్షిణ్యాలే కాదు.. పరిస్థితులు బాగుండాలని.. ఏ ఆటంకాలు ఎదురుకాకుండా కొనసాగాలని కోరుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోని పరిస్థితి కాదు ఇది మహానగర రాజధాని పరిధిలోని ఓ ప్రాంతంలో నెలకొంది. 
మరమ్మత్తులు లేక మూలనపడ్డ ఇన్వర్టర్లు
గండిపేట మండల పరిధిలోని నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని సదుపాయాలున్నట్లు కనిపిస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే కాని పరిస్థితి అర్థం కాదు. ఆస్పత్రిలో కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే చీకట్లో మగ్గిపోవాల్సిందే. దోమల బాధ సరేసరి. కరెంటు పోతే చీకట్లో దోమలకాటుకు గురై జబ్బులను నయం చేసుకోవడం మాట దేవుడెరుగు కొత్త రోగాలు అంటించుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. ఆస్పత్రిలో తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండుతున్నా ఇన్వర్టర్లను మరమ్మత్తు చేయించే పరిస్థితి లేదు. బడ్జెట్ సమస్యతో ఎవరైనారిపేర్ చేయిస్తే జేబు నుండి చెల్లించుకోవాల్సి వస్తోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదే పెద్ద  ప్రభుత్వ ఆస్పత్రి కావడంతో డెలివరీల కోసం మహిళలు తరచూ ఆస్పత్రిలో చేరుతుంటారు. అయితే వారికి సహజ కాన్పులతోపాటు సిజేరియన్ కాన్పులు చేయాల్సి వస్తుంది.  ఆపరేషన్లు తలపెట్టినప్పుడు కరెంటు పోతే చీకట్లోనే కొనసాగించాల్సి వస్తోంది. శనివారం డెలివరీ ఆపరేషన్లు చేస్తుండగా కరెంటు పోవడంతో వైద్యులు మొబైల్ ఫోన్ టార్చి లైట్ వెలుతురులోనే డెలివరీ చేశారు. ఇది చూసి ఓ మహిళ సహించలేకపోయింది. వెంటనే ఫోటోలు తీసి స్థానిక మీడియాకు షేర్ చేయడంతో ఆస్పత్రి పరిస్థితి వెలుగులోకి వచ్చింది.