విద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.18.5 కోట్లతో ఇండ్ల మీద వెళ్తున్న లైన్ల షిఫ్టింగ్

విద్యుత్ ప్రమాదాలకు చెక్.. రూ.18.5 కోట్లతో ఇండ్ల మీద వెళ్తున్న లైన్ల షిఫ్టింగ్
  • పాలేరు, మధిర నియోజకవర్గాల్లో స్పీడ్ గా పనులు 
  • ఆగస్టు నెలాఖరుకు పూర్తిచేస్తామంటున్న ఆఫీసర్లు
  • మిగిలిన మూడు నియోజకవర్గాల్లోనూ ప్రతిపాదనలు సిద్ధం

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో విద్యుత్ లైన్ల వల్ల ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇండ్ల మీద నుంచి వెళ్తున్న 11 కేవీ కరెంటు లైన్ల షిఫ్టింగ్ కు నిధులు మంజూరు చేసింది. పాలేరు, మధిర నియోజకవర్గాల్లో దాదాపు రూ.18.5 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీ జాగాల్లో వేసిన కరెంట్ లైన్లు కాస్తా తర్వాత ఇండ్ల ప్లాట్లుగా మారడం, వాటిలో ఇండ్లు కట్టుకోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ఇండ్ల నిర్మాణ పనులు జరిగే సమయంలో కరెంటు తీగలు తగలడం, ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు కరెంటు తీగలు ఇండ్లపై ప్రమాదవశాత్తు తెగిపడడం లాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఆ లైన్లను మార్చాలంటే ఒక్కో ఇంటికి కనీసం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు భరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండ్ల వరకు అదనపు స్తంభాల కోసం ఇంటి యజమానులు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇలాంటి ఖర్చును భరించలేని పేదలంతా ఆ విద్యుత్​ తీగల మధ్యనే ప్రమాదకరంగా బతుకుతుండగా, వారి కష్టాలకు విముక్తి కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టింది. 

పొంగులేటి హామీ మేరకు.. 

పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండల కేంద్రంలో 11 కేవీ లైన్లు ఇండ్ల మీద నుంచి వెళ్లే సమస్య తీవ్రంగా ఉండేది. అలాంటి కొంతమంది బాధితులు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, తాను గెలిస్తే సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. అదే మాట ప్రకారం నాలుగైదు నెలల కింద నిధులు మంజూరు కాగా, పాలేరు నియోజకవర్గంలో రూ.9 కోట్లతో ఇండ్ల మీద నుంచి వెళ్తున్న 11 కేవీ లైన్ల షిఫ్టింగ్ పనులు చేస్తున్నారు. దీని కోసం మొత్తం 1,545 స్తంభాలు షిఫ్టింగ్ చేస్తున్నారు. 

ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయని, మూడు వారాల్లో మొత్తం వర్క్​ పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో పేదలు కొత్తగా కట్టుకున్న కాలనీలకు కరెంటు పోల్స్ కోసం డీడీలు కట్టి, కొత్త స్తంభాలు వేసుకోలేని వారి కోసం అవసరమైన చోట ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 4,250 స్తంభాలు కొత్త పోల్స్ వేసి, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు.  

డిప్యూటీ సీఎం నియోజకవర్గంలోనూ.. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోనూ రూ.9.5 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి. 11 కేవీ లైన్ల షిఫ్టింగ్ లో భాగంగా 670 పోల్స్ మారుస్తున్నారు. అదనపు పోల్స్, కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటులో భాగంగా 3,213 స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో 2,100 పోల్స్ షిఫ్టింగ్ పనులు, 2,400 కొత్త స్తంభాలు, లైన్ల ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. 

వైరా నియోజకవర్గంలో1,200 స్తంభాలు,  లైన్ల షిఫ్టింగ్, 2,150 పోల్స్ కొత్త లైన్లు ఏర్పాటు చేసేందుకు, ఖమ్మం నియోజకవర్గంలో 900 పోల్స్ లైన్ల షిఫ్టింగ్, 1,500 స్తంభాలు కొత్త లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్ సిద్ధం అయ్యాయి. ప్రస్తుతం పాలేరు, మధిరలో జరుగుతున్న పనులు ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని, మిగిలిన మూడు నియోజకవర్గాలకు కూడా నిధులు మంజూరైతే త్వరలోనే ఆయా చోట్ల కూడా పనులు ప్రారంభిస్తామని ఖమ్మం జిల్లా విద్యుత్​ శాఖ ఎస్​ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. 

ఇతను ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్లకు చెందిన తుడుం ఉదయ్​ కుమార్​. 2011లో కూసుమంచిలోని ఓ ఇంటిపై రాడ్ బెండింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ ఇంటి పై నుంచి వెళ్తున్న 11 కేవీ కరెంటు వైరు తగలడంతో రెండు చేతులు కోల్పోయాడు. అప్పటి నుంచి ఏ పనీ చేయలేక, వృద్ధులైన తల్లిదండ్రులపైనే ఆధారపడి బతుకుతున్నాడు. ఉదయ్​ లాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చొరవతో పాలేరు నియోజకవర్గంలో ఇండ్ల మీద నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్​ లైన్లను షిఫ్టింగ్ చేస్తున్నారు. ఇందుకోసం 
రూ.9 కోట్లతో చేపట్టిన పనులు వచ్చే నెలలో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.