ఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే: భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..

 ఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే:  భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..

 అద్భుత ఆలయాలకు నిలయం మన దేశం.మన దేశం ఆధ్యాత్మిక భూమి. అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ ఉండే మతపరమైన ఆలయాలను సందర్శిస్తూ విదేశీయులు కూడా మంత్రముగ్ధులవుతారు.గొప్ప చరిత్రగల దేశంలో దేవాలయాలకు భారతదేశంలో  కొదువలేదు హనుమంతుడు శ్రీరామ భక్తుడు. రాముడిని పూజించినట్లే ప్రపంచవ్యాప్తంగా హనుమంతుని భక్తులు చాలా మంది ఉన్నారు. చాలా దేవాలయాలు కూడా ఉన్నాయి. హనుమాన్ మందిరాలకు వెళితే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన హనుమాన్ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం..

ఢిల్లీ ...కన్నాట్ లో..  హనుమాన్ ఆలయం:  ఢిల్లీ లో మీరు షాపింగ్ వీధులు, మాల్స్, చారిత్రక కట్టడాలు, దేవాలయాలు ఇంకా ఎన్నో స్థలాలను చూసి ఉంటారు. అయితే, మీరు చూడని సరికదా కనీసం వినని ఒక కొత్త ప్రదేశం ఉంది.  అదే కనౌట్ ప్లేస్ ...  ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ బాల హనుమాన్ దేవాలయం కలదు. ఇది చాలా పురాతమైనది, మహిమకలది. . ఇది మహాభారత కాలంలోని ఐదు దేవాలయాలలో ఒకటని పురాణాలు చెబుతున్నాయి. ఇది  మొఘల్ రాజు  దండయాత్ర కు సైతం తట్టుకొని నిలబడ్డ అతి కొద్ది దేవాలయాలలో శ్రీ హనుమాన్ దేవాలయం ఒకటి.  

ఈ  బాల హనుమాన్ దేవాలయానికి  కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హనుమంతుడు దక్షిణ ముఖం ఉండటం వల్ల ఒక కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. గంధ సింధూరం పూతతో, ధగధగతో, మెడలో పుష్పమాలలతో శ్రీ హనుమాన్ దర్శనమిస్తాడు. ఎడమ చేతిలో గధ, మరో చేయి ఛాతీ మీద పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్లు ఉండే విధంగా కనిపిస్తాడు. రామాయణ గాధ లన్ని దీనిపై చెక్క బడి ఉండటం విశేషం ..ముఖ ద్వారం అనేక శతాబ్దాల ప్రాచీన మైనది గా భావిస్తారు. శ్రీ తులసీ దాసు విరచిత రామాయణాన్ని ముఖ మండపం పై భాగం లో చిత్రించారు.ఇవి కనులకు గొప్ప విందును చేకూరుస్తాయి.

సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం... వారణాసి (ఉత్తర ప్రదేశ్):  ఈ దేవాలయాన్ని  ఒక సాధువు ... కవి...రామచరితమానస్ రచయిత సంత్ గోస్వామి తులసీదాస్  16వ శతాబ్దంలో దీనిని స్థాపించినట్లు చెబుతారు. రాముడు ..  హనుమంతుని పట్ల తనకున్న ప్రగాఢ భక్తికి పేరుగాంచిన తులసీదాస్, కష్టాలను తొలగించాలని ఆశీర్వాదం కోసం ఆలయాన్ని స్థాపించాడు.  ఈ దేవాలయం ఆధ్యాత్మిక ఆశ్రయంగా విరాజిల్లుతోంది.  ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడికి భక్తులు తరలి వస్తారు.  అనేక సమస్యలను ఎదుర్కొంటున్న భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే పరిష్కారమవుతాయని చెబుతారు.  మంగళ, శని వారారాలు ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. 

జఖు దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ :   సిమ్లాలోని   ఎత్తైన జఖు కొండపై ఉన్న ఈ ఆలయం ఉంది.   ఈ దేవాలయం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. రాక్షస రాజు రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు...  రాముడి సోదరుడు లక్ష్మణుడు...  ఇంద్రజిత్తు  ప్రయోగించిన బ్రహ్మ అస్త్రానికి  మూర్చపోయాడు. అప్పుడు  ఒక పూజారి లక్ష్మణుడి రోగనిర్ధారణ చేసి..  హిమాలయాల్లో ఉన్న ప్రత్యేకమైన సంజీవని మూలిక అవసరమని చెప్పాడు. హనుమంతుడు  ఆ మూలికను గుర్తించలేక  ఆపర్వతాన్ని తీసుకొచ్చి.. మరల ఆ ప్రదేశంలో దానిని ఉంచేందుకు  తీసుకువెళ్లే సమయంలో   కొంతకాలం జఖు కొండపై విశ్రాంతి తీసుకున్నాడు. హనుమంతుడి బరువు వల్ల కొండ శిఖరం చదును అయిందని చెబుతారు. హనుమంతుని పాదముద్రలు ఉన్న ప్రదేశం చుట్టూ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ 2010లో 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మహావీర్ మందిర్, పాట్నా:  ఉత్తర భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఓ హనుమంతుడి ఆలయం ఉంది. తూర్పున పున్పున్ నది ఒడ్డున ఉన్న జల్లా హనుమాన్ ఆలయ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. స్వామి బాలానంద్ అనే స్థానిక సాధువు 1730లో ఈ ఆలయాన్ని నిర్మించాడు.  1947లో దేశ విభజన సమయంలో చాలా మంది శరణార్థులు పాట్నాకు వచ్చారు. ఈ సమయంలోనే ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది జమ్మూ ... కాశ్మీర్‌లోని వైష్ణో దేవి తర్వాత ఉత్తర భారతదేశంలో అత్యధికంగా సందర్శించే రెండవ  పుణ్యక్షేత్రం ఇదే. గతంలో మట్టితో చేసిన ఈ ఆలయం పునరుద్ధరించబడింది. దీనిని పాట్నా మహావీర్ మందిర్ ట్రస్ట్ కమిటీ నిర్వహిస్తోంది. దాదాపు 15 కోట్లతో నిర్మించిన మహా దేవాలయంలో హనుమంతుడుతో పాటు వినాయకుడు ఉంటారు.

శ్రీ హనుమాన్ మందిర్, సారంగపూర్ : గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నుండి భావనగర్ వెళ్లే దారిలో, సాలంగ్ పూర్ (సారంగ్ పూర్) అనే ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన శ్రీ హనుమాన్ మందిరం కలదు. ఈ హిందూ దేవాలయం స్వామినారాయణ ఆలయంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ... హనుమాన్ కు అంకితం చేశారు. ఈయనను ఇక్కడ కస్త్ భంజన్ దేవ్ గా పూజిస్తారు. ఈ దేవాలయంలో విగ్రహాన్ని సద్గురు గోపాలనంద్ స్వామి ప్రతిష్టించినారు. గోపాలనంద్ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో హనుమంతుడు విగ్రహంలోకి ఆవహించి చాలాసేపు ఊగిపోయాడని, ఇదొక అద్భుత దృశ్యం అని చెబుతారు. ఇక్కడ హనుమాన్ విగ్రహానికి మీసాలు ఉంటాయి.  ఆడ రాక్షసిని కాళ్ళ కింద తొక్కుతున్న దృశ్యం, విగ్రహం వెనకాల కోతులు పండ్లను పట్టుకున్న దృశ్యాలు, గద మొదలైనవి చూడవచ్చు. ఈ  ఆలయాన్ని ఎక్కువగాక్షుద్ర పూజలతో ఇబ్బంది పడేవారు దర్శించుకుంటారు.  ఆలయంలో రెండు, మూడు రాత్రులు నిద్రించి హనుమంతుణ్ణి సేవిస్తే ఆ బారినుండి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. 

బాల హనుమాన్ దేవాలయం, జామ్‌నగర్ :  గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒక పురాతన నగరం, ఇందులో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ లఖోటా సరస్సుకి ఆగ్నేయ వైపున ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ ప్రేమ్ భూషణ్‌జీ మహారాజ్ 1963-------64లో స్థాపించారు. ఆగస్ట్ 1, 1964 నుండి నిరంతరంగా 'రామ నామం' జపించడం  వలన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అప్పడు ఈ ఆలయం  గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఈ బాల హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుని... భక్తులు  ప్రత్యేక  చేసి నైవేద్యాలు సమర్పించుకుంటారు.

బడే హనుమాన్  ఆలయం, సంగం :  ప్రయాగ్‌రాజ్ కోటకు ఉత్తరాన 500 మీటర్ల దూరంలో, బడే హనుమాన్ జీ ఆలయం ఉంది.  ఈ ఆలయం  రామాయణ కాలం నుండి ఉందని  స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.  ఇక్కడ హనుమాన్ విగ్రహం శయన భంగిమలో..అంటే పడుకొని  భక్తులకు దర్శనమిస్తాడు. శయన భంగిమలో విగ్రహం ఉన్న హనుమంతుని ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇది.  అందుకే దీనిని లేటే హనుమాన్ మందిరం.. బడే హనుమాన్ ఆలయం  అంటారు. ఇక్కడ హనుమంతుని విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది.  20 అడుగులు పొడవు.. 8 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది.  ఇక్కడ విగ్రహం సగ భాగం నీటిలో ఉంటుంది.

నమక్కల్ ఆంజనేయ ఆలయం, తమిళనాడు: తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ జిల్లా నామక్కల్ లోని ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది  చెందింది.  ఇక్కడ ఉండే నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదేశంలో లక్ష్మీదేవి తపస్సు చేసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది.  ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తుంటారు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు . ఈ ఆలయంలో స్వామి విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల.  గతంలో పైకప్పు వేయాలని ప్రయాత్నాలు జరిగాయి… ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది ఈ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది. ఆంజనేయుడు దిగంబర దేవాలయంలో (ఆకాశం పైకప్పుగా)  లక్ష్మీ నృసింహ స్వామి మరియు సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు.  . ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం. 

హనుమాన్‌గర్హి, అయోధ్య ( ఉత్తరప్రదేశ్) : ఈ ఆంజనేయస్వామి దేవాలయం  10వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడి ఒక గుహలో హనుమంతుడు నివసించాడని, రాముడి జన్మస్థలమైన  అయోధ్యలోని రామ్‌కోట్‌ కాపలాగా ఉంచాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రధాన ఆలయంలో బాల్ హనుమాన్ ఆమె ఒడిలో కూర్చున్న  అంజన విగ్రహం ఉంది. ఈ ఆలయం కొండపై ఉంది. అలాగే ఇది రామజన్మభూమి ప్రదేశానికి 1.5 కి.మీ దూరంలో ఉంది. ఇది శ్రీరాముని జన్మస్థలంగాచెబుతారు. హనుమాన్‌గర్హి ఆలయాన్ని స్వామి అభయ్‌రామ్ జీ సూచనల మేరకు షుజౌద్దౌలా సుమారు 300 సంవత్సరాల క్రితం స్థాపించారు. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు 76 మెట్లు ఎక్కాలి.  తులసీదాస్ హనుమాన్ చాలీసాలో “రామ్ దువారే తుమ్ రఖవారే, హోతా న ఆగ్య బిను పైసారే” అని  వ్రాశారు. అంటే శ్రీరాముని దర్శనానికి ముందు, మీరు హనుమాన్ జీ నుండి అనుమతి తీసుకోవాలి. కలియుగంలో హనుమాన్ జీని  పూజించడం వల్ల జీవితంలోని అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి. . హనుమాన్‌గర్హి ఆలయం గురించి కథ చాలా పెద్దది అయినప్పటికీ, రాముడు తన జీవనం ప్రారంభించినప్పుడు, అతను ఆ స్థల బాధ్యతను చూడాల్సిందిగా హనుమాన్ జీకి బాధ్యత అప్పగించాడని చెబుతుంటారు.

పంచముఖి హనుమాన్ దేవాలయం, తమిళనాడు :  తమిళనాడులో కుంభకోణం లో40 అడుగుల  శ్రీ  పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇక్కడ స్వామిఆకుపచ్చ రంగు తో స్వామి కనిపిస్తాడు .ఈ ఆలయం రామాయణ కాలం నుండి ఉందని నమ్ముతారు. ఐదు ముఖాల పంచముఖి విగ్రహం ముఖం తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం , ఆకాశానికి అభిముఖంగా ఉంటుంది.  రామసేతు వంతెనను నిర్మించడానికి ఉపయోగించిన తేలియాడే రాళ్లను ఈ ఆలయంలో ఉంచారు. కుంభకోణం–అలకుడి  రోడ్డులో తిరువారూర్ జిల్లాలో తిరువంమంగళం గ్రామం లో 32 అడుగుల భారీ శ్రీ సంకట మోచన విశ్వ రూప హనుమాన్ విగ్రహం ఉన్నది .60 టన్నుల బరువుగల శిలను మలిచి ఈ విగ్రహాన్ని వాలాజ్ బాద్ పులియం పాడి రామ కృష్ణ స్థపతి నిర్మించారు .ఇక్కడినుంచి క్రేన్ మీద తరలించి జ్ఞాన పురి లో ప్రతిష్టించారు .

మెహందీపూర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్ : రాజస్థాన్ లోని అరావళీ పర్వాతల నడుమ దౌసా అనే జిల్లాలో ఉందీ ఆలయం. అవడానికి చాలా చిన్న ఆలయమే... మహిమలు అమోఘం.  దుష్టశక్తులతో బాధలు పడేవారికి  ఈ ఆలయమే శరణ్యం అంటారు.  ఈ ఆలయంలో ఉన్న మందిరంలో  హనుమంతుడు (బాలాజీ అని కూడా పిలుస్తారు). ...స్వామివారు వెలిసిన చోటున బాలహనుమంతునితో పాటుగా మరో రెండు విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఒకటి శివుని ఉగ్రరూపమైన భైరవుని సూచించే విగ్రహమైతే మరొకటి దుష్టశక్తులకు రాజుగా భావించే ‘ప్రేతరాజు’ విగ్రహం. వేయి సంవత్సరాల క్రితం ఇక్కడ పూజల మొదలైనప్పటి నుంచీ కూడా, స్వామివారి అసాధారణ మహిమలు భక్తులకు అనుభవంలోకి రాసాగాయి. దుష్టశక్తుల బారిన పడ్డవారితో పాటుగా... మానసిక స్థితి సరిగా లేనివారు, మూర్ఛరోగులు, పక్షవాతంతో బాధపడేవారు, సంతానం లేనివారు ఈ స్వామివారి ఆశీస్సులతో సమస్య నుంచి దూరమయ్యేందుకు ఇక్కడకు చేరుకుంటారు. ఈ ఆలయం దుష్టశక్తుల బారిన పడిన భక్తులను నయం చేయగలదని చాలా సంవత్సరాలుగా ప్రసిద్ది చెందింది.

సలాసర్ హనుమాన్ మందిర్, సలాసర్ : రాజస్థాన్‌లోని సలాసర్ పట్టణం నడిబొడ్డున ఉంది. మీసాలు మరియు గడ్డం ఉన్న హనుమంతుని ఏకైక ఆలయం ఇది అని చెబుతారు.  ఏడాది పొడవునా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సలాసర్ బాలాజీ మందిర్‌ను స్థానికులు సలాసర్ ధామ్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా చైత్ర పూర్ణిమ  రోజు అనగా హనుమత్ జయంతి రోజు ( 2024ఏప్రిల్ 23)  రద్దీగా ఉంటుంది. ఆరోజు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.  ఇక్కడ స్వామిని దర్శంచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తారు.