ప్రపంచ చెస్ టోర్నీలో భారత టీనేజర్ సంచలనం

ప్రపంచ చెస్ టోర్నీలో భారత టీనేజర్ సంచలనం

ప్రపంచ చెస్ చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఇండియన్ టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందా వరల్డ్ నెంబర్ వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్ సన్కు ఓటమి రుచి చూపించారు. ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో 16ఏళ్ల  ప్రజ్ఞానందా 8వ రౌండులో కార్ల్సన్ను ఓడించాడు. నల్ల పావులతో ఆడిన ఈ టీనేజర్ 39 ఎత్తుల్లోనే నార్వే దిగ్గజం ఆట కట్టించాడు. ఈ విజయం తర్వాత 8 పాయింట్లతో ప్రజ్ఞానందా 12వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మూడు వరుస విజయాలతో జోష్ మీదున్న కార్ల్ సన్ ఈ పోరులో గెలవడం నల్లేరుపై నడకేనని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత టీనేజర్ ఆయన జోరుకు కళ్లెం వేశాడు.

2018లో ప్రజ్ఞానందా 12 ఏళ్ల వయసులో భారత లెజెండరీ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బద్దలు కొట్టి గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ 18 ఏళ్ల వయసులో ఈ టైటిల్ సాధించాడు. అంతకు ముందు 2016లో ప్రజ్ఞానందా యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.