ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజాపాలన గ్రామసభలు..

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో  ప్రజాపాలన గ్రామసభలు..

వెలుగు, నెట్​వర్క్​: ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గురువారం 99 రోజుల ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు గణపురం, రేగొండ మండలాల్లో నిర్వహించిన ప్రోగ్రామ్​లో కలెక్టర్​ రాహుల్​శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ప్రభుత్వ పథకాల అమలుతీరుపై వివరించారు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం నాగారంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​ హాజరై కార్యక్రమ అమలుపై పలు సూచనలు చేశారు. ధర్మసాగర్​ మండలం ముప్పారంలో మహిళా సర్పంచ్​ల ఫోరం రాష్ట్ర కన్వీనర్​ గుంటిపల్లి రేణుక ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభకు జనం హాజరై పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అంతారంలో నిర్వహించిన గ్రామసభలో వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్​ పాల్గొని మాట్లాడారు. రెండు ఉమ్మడి జిల్లాల్లోని ఆయా మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించారు. జనగామ మున్సిపాలిటీలోని 25వ వార్డులో కౌన్సిలర్​ పాముకుంట్ల ప్రసాద్​ కుమార్​ పర్యవేక్షణలో వార్డు సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రజలను నేరుగా కలుసుకుని సమస్యలపై ఆరా తీశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరిపెడ మున్సిపల్​ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రునాయక్​ హాజరై మాట్లాడారు. ​ పాల్వంచలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్యాశాఖ ఆఫీసర్​ డాక్టర్​ తుకారాం రాథోడ్, కొత్తగూడెం కార్పొరేషన్​ కమిషనర్​ సుజాత, కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న హాజరై ప్రభుత పథకాలపై వివరించారు.​ 

ములుగు జిల్లా వ్యాప్తంగా 171 గ్రామపంచాయతీలతోపాటు ములుగు మున్సిపాలిటీలోని 20వార్డుల్లో గ్రామసభలు జరిగాయి. ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే 1391 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్​ రమేశ్​వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని ఆయా జీపీల్లో నిర్వహించిన గ్రామసభల్లో సుమారు 5939 దరఖాస్తులు ప్రజల నుంచి స్వీకరించినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 571 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు, 177 మున్సిపల్ వార్డుల్లో వార్డు సభలు విజయవంతంగా నిర్వహించినట్లు అడిషనల్​ కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు.