
- ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చిన జనం
- ఒకే రోజు 373 మంది ఫిర్యాదులు
- ఎన్నికల కోడ్ ఉండడంతో ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి
పంజాగుట్ట, వెలుగు: హైదరాబాద్ బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ప్రజావాణిని అధికారులు శుక్రవారం నుంచి పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ప్రజాభవన్‌కు భారీగా తరలివచ్చి, సమస్యలపై ఫిర్యాదులు చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.
మొత్తం 373 ఫిర్యాదులు రాగా, వాటిలో రెవెన్యూ సమస్యలపై 120, విద్యా శాఖకు చెందినవి 43, మున్సిపల్ 43, హోంశాఖ 29, పౌరసరఫరాలకు 18, ఇతర శాఖలకు సంబంధించి మరో 120 ఉన్నాయి. ఇండ్లు మంజూరు చేయాలని, ధరణి సమస్యలు తీర్చాలని, ఫించన్లు ఇవ్వాలని కోరుతూ ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు.
నా ఆస్తిని అమ్మకుండా చూడండి..
నాకు ముగ్గురు కొడుకులు. పెద్దొడు లేడు. ఉన్న ఇద్దరు కొడుకులు నా ఆస్తిని అమ్ముకొని, నాకు ఇల్లు లేకుండా చేశారు. నా కొడుకు నుంచి ఆస్తిని కాపాడండి. నా ఇల్లు నాకు ఇచ్చేలా చేయండి.
- జె.బుచ్చమ్మ (90)
మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా
పెన్షన్ మంజూరు చేయండి..
నేను టైలర్‌ని పనిచేస్తున్నాను. ఓ యాక్సిడెంట్‌లో నా చేయి విరిగిపోయింది. 70 ఏండ్ల వయసులో ఎలాంటి పనిచేయడం చేతనైత లేదు. ఉండటానికి నాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు, పింఛన్ మంజూరు చేయండి.
- ఎస్‌కే రెహ్మన్, షాద్‌నగర్,
రంగారెడ్డి జిల్లా
నా భూమిని కాజేశారు..
1997లో 22 ఎకరాల భూమిని నేను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాను. ఈ భూమి ఓనర్ నాతో పాటు మరో ముగ్గురికి ఇదే ల్యాండ్‌ని అమ్మాడు. ధరణిలో నా పేరు చూపకుండా ఆ వ్యక్తుల పేర్లు కనిపిస్తున్నాయి. నాకు న్యాయం చేయండి.
- సాంబయ్య నాయక్,
రామాంతపూర్, మెదక్ జిల్లా
ప్రభుత్వం ఆదుకోవాలి..
నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగింది. నా భర్త సతీశ్‌కు సంపాదన లేదు. మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోండి. పూటగడవడం కష్టంగా ఉంది. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగా లేవు.
- భవానీ, జీడిమెట్ల, హైదరాబాద్