హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలో ఎన్నో మలుపులు తిరిగి మళ్లీ మొదటికే వచ్చిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మాత్రమే. ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు మొదలైన ఈ ప్రాజెక్టు రాజకీయ, అంతర్రాష్ట్ర వివాదాలతో ఆగిపోయినా, తన ప్రాధాన్యాన్ని చాటుతూనే ఉంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై తాజాగా మహారాష్ట్ర సీఎంతో తెలంగాణ సీఎం బృందం జరిపిన చర్చలతో ఈ ప్రాజెక్టు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
కాళేశ్వరం కుంగుబాటు, రిపేర్లు చేసినా గ్యారంటీ లేదన్న నిపుణుల హెచ్చరికలు, ఒకవేళ ఎత్తిపోసినా తడిసిమోపెడయ్యే కరెంట్ ఖర్చుల నేపథ్యంలో తెలంగాణ సాగునీటి అవసరాలకు ఇక తుమ్మిడిహెట్టే ఆధారమనే అభిప్రాయం బలపడుతోంది.కేంద్ర మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి జీవితకాల కలగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి వద్ద పురుడుపోసుకుంది. ప్రాణహిత నీళ్లు తెలంగాణకు దక్కాలని అత్యంత బలంగా నినదించిన తొలి నాయకుడు కాకాయే
కాళేశ్వరం నిరుపయోగంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాకా కలల ప్రాజెక్టు తుమ్మిడిహెట్టిని మళ్లీ తెరపైకి తెచ్చింది. గతంలోని లోపాలను సరిదిద్దుతూ తుమ్మిడిహెట్టి వద్ద రెండు బ్యారేజీలు నిర్మించేలా పటిష్ఠంగా కొత్త డిజైన్ రూపొందించింది. ఆర్వీ అసోసియేట్స్, పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) క్షేత్రస్థాయిలో అధ్యయనాలు చేసి ముంపు తక్కువేనని తేల్చాయి. ఆ రిపోర్టుల ఆధారంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి లేఖలు రాసి, మహారాష్ట్రను ఒప్పించాలని కోరారు.
ALSO READ : మెదక్ జిల్లా లో ఒకే కరువు మండలమా..ఒక్క మనోహరాబాద్కే చోటు
దీంతో సెప్టెంబర్‌లో తొలిసారిగా రెండు రాష్ట్రాలతో సెంట్రల్ వాటర్ కమిషన్ సమావేశం నిర్వహించింది. ఈ నెల 26న ముంబైలో సీఎంల స్థాయి సమావేశం జరిగింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ అధికారులు భేటీ అయ్యారు. తాజా రిపోర్టులన్నీ సమర్పించి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ రాష్ట్రంలో ముంపు లేకుంటే, ప్రజలకు నష్టం జరగకుంటే ఎత్తుపై పునరాలోచిస్తామని ఫడ్నవిస్ స్పష్టం చేశారు. జాయింట్ కమిటీ వేసి మళ్లీ అధ్యయనం చేయించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దీంతో ప్రాజెక్టు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అడుగు వేసినట్లయింది. కాకా కలల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.
జలయజ్ఞంలో కీలకం
2004లో వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞంలో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కీలకంగా మారింది. సమగ్ర సర్వేల అనంతరం 2007 మేలో జీవో 124ను, 2008 నవంబర్‌లో పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో 272ను జారీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతిగా నామకరణం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని దాదాపు 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలకు 10 టీఎంసీలు, గ్రామాల తాగునీటికి మరో 10 టీఎంసీలు, పరిశ్రమలకు 16 టీఎంసీలు కలిపి మొత్తం 160 టీఎంసీల నీటిని మళ్లించాలని నిర్ణయించారు. 2008 నవంబర్‌లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కు, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద కాల్వల పనులకు వైఎస్ శంకుస్థాపన చేశారు.
నిధులు పుష్కలం
తొలుత ప్రాజెక్టును రూ.17,875 కోట్లతో నిర్మించాలనుకోగా, డీపీఆర్ సిద్ధమయ్యే నాటికి అంచనా రూ.38,500 కోట్లకు చేరింది. ప్రాజెక్టును 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన బ్యారేజీకి మహారాష్ట్ర నుంచి అడ్డంకులు తొలగకముందే కాల్వలు, సొరంగాలు, లిఫ్ట్ పంప్‌హౌస్‌ల పనులు మొదలుపెట్టారు. ప్రాజెక్టుకు 80 వేల ఎకరాలకు పైగా భూమి అవసరం కాగా, సుమారు 40 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు. 2008 నుంచి 2014 మధ్య దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు.
