దేశంలో తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి

దేశంలో తొలి అంధ మహిళా ఐఏఎస్ అధికారి

మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్ పాటిల్ దేశంలోనే తొలి అంధ ఐఏఎస్ అధికారిగా రికార్డులకెక్కారు.ఇవాళ ( సోమవారం) ఆమె కేరళ రాజధాని తిరువనంతపురం సబ్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు.

ప్రాంజల్‌ పాటిల్‌ మహారాష్ట్రలోని ఉల్‌హస్‌నగర్‌కు చెందినవారు. ఆమె తన ఆరేళ్ళ వయస్సులోనే కంటి చూపు కోల్పోయారు. ఐఎఎస్‌ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏ మాత్రం అడ్డంకి కాలేదు. అనేక అవరోధాలను అధిగమించి సివిల్‌ సర్వీసులకు ఎంపికైన తొలి అంధ మహిళగా నిలిచారు. ఇవాళ తిరువనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ కె. గోపాలకృష్టన్‌, ఇతర సిబ్బంది సమక్షంలో ఆమె బాధ్యతుల స్వీకరించారు.

సబ్ కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించడం తనకు చాలా గర్వంగా ఉందన్నారు ప్రాంజల్ పాటిల్. ప్రజల నుండి, కలెక్టరేట్‌ కార్యాలయ సిబ్బంది నుండి తనకు మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

2017 సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ప్రాంజల్ పాటిల్ 124వ ర్యాంకు సాధించారు. తర్వాత 2018లో కేరళలోని ఎర్నాకుళం అసిస్టెంట్‌ కలెక్టర్‌గా పనిచేశారు.