బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు..

V6 Velugu Posted on Oct 12, 2021

క్యాన్సర్​.... అంతుచిక్కని జబ్బు. కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లని మొదటి దశలో గుర్తించకుంటేట్రీట్​మెంట్​ తీసుకున్నా కోలుకోవడం కష్టమవుతుంది. అలాంటిదే బ్రెస్ట్ క్యాన్సర్​.  మహిళల్లో బ్రెస్ట్​ క్యాన్సర్​ కేసులు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ల విషయంలో ‘చికిత్స కంటే నివారణ మేలు’ అంటున్నారు డాక్టర్​ సాయి రామ్. 

ముప్పైయేండ్లు దాటిన తర్వాత పిల్లలు పుట్టిన మహిళల్లో బ్రెస్ట్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దాంతో వీళ్లలో ఈస్ట్రోజన్​ హార్మోన్​ లెవల్స్ పెరుగుతాయి. లావుగా ఉన్న మహిళల్లో ఫ్యాట్ ఎక్కువ. వీళ్లలో ఈస్ట్రోజన్​ ఎక్కువ ఉంటుంది. హైపర్​ ఈస్ట్రోజన్​ వల్ల, చీజ్​ ఎక్కువ తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్​ వచ్చే ఛాన్స్​ ఉంది. చీజ్​​లో ఫ్యాట్,  ఈస్ట్రోజన్​ హార్మోన్​ ఎక్కువ. స్మోకింగ్​, ఆల్కహాల్​ తాగడం వంటి అలవాట్లు కూడా ఈ క్యాన్సర్​ ముప్పుని పెంచేవే. హార్మోన్ రిప్లేస్​మెంట్​ థెరపీ వల్ల శరీరంలో ఈస్ట్రోజన్​ హార్మోన్​​ పెరుగుతుంది. అది బ్రెస్ట్ క్యాన్సర్​కి దారితీస్తుంది.  

కారణాలనేకం

బ్రెస్ట్​ క్యాన్సర్​ రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్​ లెవల్స్ పెరగడం, ఫుడ్​లోని కార్సినోజెనిక్​ పదార్థాలు ప్రధాన కారణం. మెటర్నిటీ లీవ్​ అయిపోగానే లేదా వేరే కారణాల వల్ల పిల్లలకి పాలు ఇవ్వడం మానేసేవాళ్లకి బ్రెస్ట్ క్యాన్సర్​ రిస్క్​ ఎక్కువ. పెళ్లి చేసుకోని వాళ్లు, పిల్లలు పుట్టని వాళ్లు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్​ బారిన పడుతుంటారు. పౌల్ట్రీ ఫుడ్​లోని కెమికల్స్, చీజ్​​లో ఉండే కార్సినోజెనిక్​ గుణాలు  బ్రెస్ట్​ క్యాన్సర్​కి కారణమవుతాయి. స్మోకింగ్​ ఎలాగైతే ఊపిరితిత్తుల క్యాన్సర్​కి కారణమవుతుందో, అలాగే చీజ్​ కూడా బ్రెస్ట్ క్యాన్సర్​కి కారణమవుతుందని చెప్పొచ్చు. అలాగే, చిన్న వయసులోనే పీరియడ్​ మొదలైన వాళ్లకి, యాభైయేండ్లు దాటినంక మెనోపాజ్​ దశలోకి అడుగుపెట్టే వాళ్లకి బ్రెస్ట్​ క్యాన్సర్​ వచ్చే అవకాశం ఉంది.  

ఈ లక్షణాలుంటే... 

కాన్పు తర్వాత మహిళల బ్రెస్ట్​ షేప్​ మారుతుంది. అలాకాకుండా పిల్లలు పాలు తాగడం మానేసిన తర్వాత ఒక్కసారిగా బ్రెస్ట్ షేప్​ మారడం, బ్రెస్ట్​లో చిన్న చిన్న గడ్డలు  ఏర్పడడం (వాటిని నొక్కితే నొప్పి ఉండదు),  రొమ్ముల దగ్గరి చర్మం అక్కడక్కడ సొట్టలు పడడం, చనుమొనల నుంచి పాలు కారడం, చనుమొనల మీద గడ్డలు ఏర్పడడం వంటివి కూడా బ్రెస్ట్ క్యాన్సర్​ లక్షణాలు. 

గుర్తించడం ఎలా?

బ్రెస్ట్ క్యాన్సర్​ని ముందుగానే గుర్తించడం కొంచెం కష్టమే. ముప్పైయేళ్లు దాటిన మహిళలు సెల్ఫ్​ బ్రెస్ట్​ ఎగ్జామినేషన్​ ద్వారా రొమ్ములో  గడ్డలు ఉన్నాయా? లేదా? అనేది చెక్​ చేసుకోవాలి. ఒకవేళ గడ్డలు ఉన్నట్టు అనిపిస్తే... మమోగ్రఫీ, సోనో–మమోగ్రఫీ తీయించుకోవాలి. డాక్టర్​ని కలిసి క్యాన్సర్​ ఉందా? లేదా? అనేది తెలుసుకోవాలి. కొన్నిసార్లు సెల్ఫ్​ బ్రెస్ట్ ఎగ్జామినేషన్​లో గడ్డల్ని గుర్తించేలోపే క్యాన్సర్​ ముదిరిపోతుంది. 

ఆ సంఖ్య ఎక్కువ

ముప్పైయేండ్లు దాటిన మహిళలు మమోగ్రఫీ, సోనో–మమోగ్రఫీ తీయించుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్​కి పదేళ్లు హార్మోనల్​ థెరపీ ట్రీట్​మెంట్​ తీసుకోవాలి. పదేళ్ల ట్రీట్​మెంట్​ తర్వాత కోలుకునేవాళ్ల శాతం పెరుగుతోంది. ఊళ్లలో ఉండే మహిళల కంటే  సిటీలో ఉంటున్న మహిళల్లోనే బ్రెస్ట్ క్యాన్సర్​ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి. అందుకు కారణం సిటీలో ఉండేవాళ్ల లైఫ్​స్టయిల్​, అనారోగ్యకరమైన ఫుడ్​ హ్యాబిట్స్​తో పాటు కలుషితమైన వాతావరణం కూడా కారణమే. మనదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్​ మీద అవేర్​నెస్ తక్కువ. దానికి తోడు ట్రీట్​మెంట్​ ఖర్చు, మెడిసిన్స్​ రేట్లు ఎక్కువ.  మనదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్​తో చనిపోతున్న ఆడవాళ్ల సంఖ్య ఎక్కువ. అంతేకాదు చైనా, అమెరికా, జపాన్​ వంటి దేశాల కంటే మనదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్​ రికవరీ రేటు కూడా తక్కువే.

జాగ్రత్తలు ముఖ్యం

తల్లులు మెటర్నిటీ లీవ్​ అయిపోయినంక కూడా పిల్లలకి పాలివ్వాలి. ముప్పైయేండ్లు దాటిన మహిళలంతా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్​ తరచూ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మమోగ్రఫీ, సోనో–మమోగ్రఫీ కూడా చేయించుకోవాలి. పౌల్ట్రీ ఫుడ్​ తక్కువ తినాలి. చీజ్​ తినడం మానేయాలి. బ్యాలెన్స్​డ్ డైట్ తీసుకోవాలి.  డైట్​లో1 శాతం ప్రొటీన్​, 1 శాతం కార్బోహైడ్రేట్, 1 శాతం ఫ్యాట్​​ ఉండాలి. ఫ్యాట్​ ఉన్న ఫుడ్స్​ బాగా​ తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువ తినాలి.

- డాక్టర్​ సాయి రామ్​
ఆంకాలజిస్ట్
స్వర్ణసాయి హాస్పిటల్స్​  హైదరాబాద్​

Tagged breast cancer, milk, womens, precautions

Latest Videos

Subscribe Now

More News