పరిస్థితి విషమించి గర్భిణి మృతి

పరిస్థితి విషమించి గర్భిణి మృతి

కల్వకుర్తి, వెలుగు: కల్వకుర్తి పట్టణానికి చెందిన రాజేశ్వరి(21) బుధవారం అర్ధరాత్రి పట్టణంలోని గవర్నమెంట్​హాస్పిటల్​కు కాన్పుకు వచ్చింది. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేశారు. శిశువుకు సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. గంట తర్వాత రాజేశ్వరికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి, బీపీ పెరిగింది.‌‌‌‌‌‌‌‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను కూడా హైదరాబాద్ తరలించారు. మార్గమధ్యలోనే రాజేశ్వరి చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు. తమ తప్పిదమేమీ లేదని హాస్పిటల్​ సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం పేర్కొన్నారు.

అచ్చంపేట:‌‌‌‌‌‌‌‌ వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసిపాప ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పదర మండల కేంద్రానికి చెందిన మంజుల డెలివరీ కోసం ఈనెల 25న అచ్చంపేట హాస్పిటల్​కు వచ్చింది. డాక్టర్లు ఆమెకు 26న నార్మల్ ​డెలివరీ చేశారు. శిశువు అపస్మారక స్థితితో ఉండటంతో హైదరాబాద్​ నీలోఫర్​కు రెఫర్ ​చేశారు. చిన్నారిని పరిశీలించిన అక్కడి డాక్టర్లు పాప మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహంతో అచ్చంపేట హాస్పిటల్​కు చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు గురువారం ఆందోళన చేపట్టారు. మంజుల కాన్పు కోసం ఇబ్బంది పడుతున్నా సిజేరియన్​ చేయాల్సి ఉండగా, వైద్యులు బలంవంతంగా కడుపుపై ఒత్తి నార్మల్ ​డెలివరీ చేశారని, అందుకే పాప మృతి చెందిందని ఆరోపించారు.

ఘటనపై వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ జయరాం రెడ్డి స్పందించారు. డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్, స్టాఫ్ నర్స్ లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు, మరో కాంట్రాక్ట్ ఉద్యోగి ని తొలగించినట్లు పేర్కొన్నారు.