సీఎస్ సోమేశ్​ కుమార్​కు బీజేపీ ఫిర్యాదు

సీఎస్ సోమేశ్​ కుమార్​కు బీజేపీ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని టీఎన్జీవో నేతలు రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఆరోపించారు. టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్,  టీజీవో అధ్యక్షురాలు మమతపై చర్యలు తీసుకోవాలని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, మున్సిపల్, హెల్త్ డిపార్ట్ మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలకు లేఖ రాశారు.

ప్రభుత్వ సర్వీస్ లో ఉండి ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటు వేయాలని కోరడం తెలంగాణ స్టేట్  సివిల్ సర్వీసెస్ రూల్స్ లోని రూల్ 16 (1), రూల్ 19 (1) కు విరుద్ధమని ఆయన లేఖ లో పేర్కొన్నారు. అధికార పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని గత నెల 28న స్టేట్ మెంట్ ఇచ్చారని, 29న అన్ని పేపర్లలో ఆ వార్త పబ్లిష్ అయిందని ప్రేమేందర్ రెడ్డి గుర్తుచేశారు. ఈ లేఖతో వారి స్టేట్ మెంట్ పంపుతున్నట్లు కూడా పేర్కొన్నారు. ఆ ఇద్దరు నేతలను సస్పెండ్ చేయడంతో పాటు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. చర్యలు తీసుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ప్రేమేందర్ రెడ్డి హెచ్చరించారు.