
- కంపెనీ చరిత్రలో నాలుగు బ్లాస్టింగ్స్
- ఈ ఏడాదిలోనే ఆరుగురు మృతి
- గతంలో ఐదుగురు దుర్మరణం
యాదాద్రి, వెలుగు: జిల్లాలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది జరిగిన నాలుగు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. గతంలోనూ పలువురు కార్మికులు మృతి చెందారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులో 35 ఏండ్ల క్రితం ప్రీమియం ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఏర్పడింది. ఇప్పుడా కంపెనీలో మూడు డివిజన్లు ఉన్నాయి. డిటోనేటర్(డెట్), డీఎఫ్ ( డిటోనేటర్ ఫ్యూజ్), ఎస్పీడీ (స్పెషల్ ప్రొడక్ట్ డివిజన్) నడుస్తున్నాయి.
ఈ డివిజన్లలో వందలాది మంది పని చేస్తున్నారు. ఈ కంపెనీలోని 'ఎమల్షన్ బూస్టర్' విభాగంలో బొగ్గుబావులు, సున్నపు రాతి, రాతి గుట్టలను పేల్చడానికి ఉపయోగించే డిటోనేటర్లు, ఫ్యూజ్లను తయారు చేస్తోంది. వీటిని పేల్చడానికి పావుకిలో నుంచి రెండు కిలోల వరకు ఫ్యూజ్లను ఉపయోగిస్తారు. వీటికి డిటోనేటర్లను అనుసంధానం చేసి పేలుస్తారు. దీంతోపాటు ఇస్రోకు వివిధ రకాల ప్రొడక్ట్‌ను సరఫరా చేస్తున్నారు. గడిచిన నాలుగేండ్లుగా డిఫెన్స్ నుంచి ఆర్డర్స్ ప్రకారం బీకే ఎన్ వో-3 కూడా తయారు చేస్తోంది. ఈ కంపెనీకి అనుబంధంగా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఎక్స్ప్లోజివ్ కంపెనీని స్థాపించారు. ఈ రెండు కంపెనీల్లో చోటు చేసుకున్న పేలుడు కారణంగా పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాదిలోనే ఆరుగురు..
ఈ కంపెనీ 35 ఏండ్ల చరిత్రలో ఈ ఏడాదిలోనే ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాదిలో జరిగిన మూడు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. 2025 జనవరిలోనే డిఫెన్స్కోసం బీకేఎన్‌వో -3ను మెగ్నీషియంతోపాటు గన్ పౌడర్ సహా మరికొన్నింటిని మిక్స్‌చేసి క్యారం బోర్డు కాయిన్ సైజులో టాబ్లెట్తయారు చేస్తున్న సమయంలో ఒత్తిడికి కారణంగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో అక్కడున్న కనకయ్య మృతి చెందాడు. మరికొందరికి గాయాలయ్యాయి.
మేలో మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ఎక్స్ప్లోజివ్ కంపెనీలోని బిల్డింగ్-18(ఏ) బ్లాకులో ప్రోక్లెంట్ మిక్సింగ్ చేస్తుండగా పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు దాటికి ఆ బిల్డింగ్ మొత్తం కుప్పకూలింది. ఈ ఘటనలో దేవీ చరణ్, గునుకుంట్ల సందీప్, నరేశ్అక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు బర్ల శ్రీకాంత్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా పెద్ద కందుకూరులోని కంపెనీలో బ్రాయిలర్ స్టీమ్ వాల్‌ను సరి చేస్తుండగా వాల్ఊడిపోయి కార్మికుడు సదానందం తలకు బలంగా తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
గతంలో ఐదుగురు మృతి..
2012లో జరిగిన పేలుడులో ఆలేరుకు చెందిన మోయినొద్దీన్, ఎల్లయ్య దుర్మరణం చెందారు. 2019లో జరిగిన బ్లాస్టింగ్‌లో పెద్ద కందుకూరుకు చెందిన జైపాల్ చనిపోయాడు. బ్లాస్టింగ్పౌడర్మిక్స్చేసే బ్లేడ్ ఊడిపోయి తాకడంతో కార్మికుడు సాగర్ తీవ్రగాయాలై మరణించాడు. 1999లో కంపెనీ ఆవరణలో ఎక్స్ప్లోజివ్ వెహికల్ ఢీకొనడంతో పెద్ద కందుకూరుకు చెందిన గడ్డమీద సాగర్మృతి చెందాడు.