వ్యవసాయ శాఖకు వీఆర్ఏలు!

వ్యవసాయ శాఖకు వీఆర్ఏలు!
  • 6 వేల మందిని కేటాయించేందుకు ప్రపోజల్స్ 
  • ప్రతి 2,500 ఎకరాలకు ఒకరి నియామకం 
  •  ఏఈవోలకు అసిస్టెంట్లుగా, రైతువేదికల వారిగా విధులు 
  •  ఫీల్డ్‌ లెవల్‌ సమస్యలకు చెక్‌ పెట్టాలని యోచన   
  •  త్వరలో కేటాయింపులకు సన్నాహాలు 

హైదరాబాద్‌, వెలుగు: రెవెన్యూ శాఖ నుంచి 6 వేల మంది వీఆర్ఏలను అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ కు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫీల్డ్ లెవెల్ లో ఏర్పడుతున్న సమస్యలను అధిగమించేందుకు వీరిని వినియోగించనున్నారు. వీరి కేటాయింపుతో అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్(ఏఈవో)లపై పని భారాన్ని తగ్గించేందుకూ వీలుకానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 21 వేలకుపైగా వీఆర్ఏలు ఉన్నారు. వీరిలో ఆరు వేల మందిని కేటాయిస్తే ఫీల్డ్ లెవల్ లో ఏఈవోలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించవచ్చని యోచిస్తున్నారు. ఇందుకోసం ప్రపోజల్స్ సైతం సిద్ధమయ్యాయి. 

2,500 ఎకరాలకు ఒకరు 

రాష్ట్రవ్యాప్తంగా రూ.573 కోట్లు ఖర్చు పెట్టి 2,604 రైతువేదికలు నిర్మించినా అక్కడ సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కనీసం తాళం వేసే వాళ్లు, తీసే వాళ్లు లేని పరిస్థితి కొనసాగుతోంది. రాష్ట్రంలోని 2,795 క్లస్టర్ల పరిధిలో కోటిన్నర ఎకరాల సాగు భూమి ఉంది. వ్యవసాయ శాఖకు ఫీల్డ్ లెవల్ లో మొత్తం 2,601 మంది ఏఈవోలు ఉన్నారు. అయితే, రైతువేదికల నిర్వహణతో పాటు గ్రామాల్లో సర్వే నంబర్ల వారిగా పంటల నమోదు, రైతు బీమా, రైతుబంధు, పంటల కొనుగోళ్లు, పామ్‌ ఆయిల్‌ సాగు, తదితర బాధ్యతలతో ఏఈవోలకు పని భారం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాలపై పూర్తి పట్టున్న వీఆర్‌ఏలను తీసుకోవడం ద్వారా సర్వే నంబర్లు, రైతుల భూముల గుర్తింపు, రైతు బీమాలో రైతు మృతుల కుటుంబాల వివరాల విషయంలో ఏఈవోలకు ఇబ్బందులు తొలగనున్నాయి. 

అందుకే ఏఈవోలకు సహాయకులుగా వీఆర్‌ఏలను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తాజా ప్రతిపాదనల్లో ప్రతి 2,500 ఎకరాలకు ఒక వీఆర్ఏను నియమించనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాలకు 6 వేల మంది వీఆర్‌ఏలకు బాధ్యతలు అప్పగించనున్నారు. ఫీల్డ్ లెవల్ నుంచి వస్తున్న ప్రపోజల్స్ ను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ సబ్ కమిటీ ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. 

ఏఈవోలపై 60% అధిక పనిభారం   

వ్యవసాయ శాఖ 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా 2,795 క్లస్టర్లను ఏర్పాటు చేసింది. క్లస్టర్ ల వారిగా 2,601 మంది ఏఈవోలను నియమించింది. కానీ ఆచరణలో మాత్రం నాలుగైదు గ్రామాలకు ఒక  క్లస్టర్ ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించింది. దీంతో ఒక్కో ఏఈవో పరిధిలో కేటాయించిన కంటే రెండు మూడు రెట్లు అధికంగా భూములు ఉన్నాయి. 

ఫీల్డ్ లెవల్ లో ఇద్దరు ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరే చేస్తుండటంతో ఏఈవోలపై దాదాపు 60 శాతం అధికంగా పని భారం పడుతోంది. రాష్ట్రంలోని 65 లక్షల మందికి రైతుబంధు, 38 లక్షల మందికి రైతుబీమా, 1.50 కోట్ల ఎకరాల పంటల సర్వే, ధాన్యం కొనుగోళ్లకు టోకెన్‌లు ఇవ్వడం వంటివి ఏఈవోలే చేయాల్సి ఉంది.