
- అణగారిన వర్గాల కోసం ఎన్నో స్కీంలు తెచ్చింది
- దేశంలో రాజకీయ ప్రజాస్వామ్యం భేష్
- అసమ్మతి ధోరణులు వద్దు.. అందరినీ కలుపుకునిపోవాలి
- దేశ విభజన అతిపెద్ద మానవ విషాదమని ఆవేదన
- 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి సామాజిక న్యాయమే ప్రాధాన్య అంశమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భిన్నత్వం, బహుళత్వంలోనే భారతదేశ బలం ఇమిడి ఉందని, ఇది దేశాన్ని ఏకీకృత వ్యవస్థగా ముందుకు నడిపిస్తుందన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి బుధవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్న మోదీ సర్కారు ఎస్సీ, ఎస్టీలు, ఇతర అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని చెప్పారు.
సమాజ పునాదుల్లో సామాజిక ప్రజాస్వామ్యం లేకపోతే రాజకీయ ప్రజాస్వామ్యం ఎక్కువ కాలం కొనసాగదు” అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొటేషన్‌ను రాష్ట్రపతి ప్రస్తావించారు. రాజకీయ ప్రజాస్వామ్యం పెరగడమే దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని చెప్పేందుకు నిదర్శనమన్నారు. దేశంలో సామాజిక వారసత్వాల ఆధారంగా అసమ్మతిని రేకెత్తించే ధోరణులను తప్పనిసరిగా తిరస్కరించాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో అన్ని వర్గాలనూ కలుపుకునిపోయేందుకు దృఢమైన చర్యలు తీసుకోవాలన్నారు.
అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం..
అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నేరుగా ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్ గార్ ఆధారిత్ జన్ కల్యాణ్ (పీఎం సూరజ్) పథకాన్ని తెచ్చిందని రాష్ట్రపతి తెలిపారు. ఆదివాసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు పీఎం జన్ జాతీ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్ మన్) స్కీంను ప్రవేశపెట్టిందన్నారు. పారిశుధ్య కార్మికులు మ్యానువల్ స్కావెంజింగ్ లో పాల్గొని ప్రమాదాల బారిన పడకుండా చూసేందుకు ‘నమస్తే’ పథకాన్ని కూడా కేంద్రం తెచ్చిందని రాష్ట్రపతి వివరించారు.
పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద 80 కోట్లకుపైగా మందికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోందన్నారు. గత దశాబ్ద కాలంలో మహిళల సంక్షేమం కోసం బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. ‘‘కేంద్రం తీసుకున్న చర్యలతో వివిధ రంగాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్యం పెరిగింది. లింగ నిష్పత్తి కూడా మెరుగుపడింది. మహిళల సంక్షేమంతోపాటు సాధికారతకు కూడా కేంద్రం సమాన ప్రాధాన్యం ఇచ్చింది” అని ఆమె తెలిపారు. మహిళల సాధికారత దిశగా విమెన్ రిజర్వేషన్ యాక్ట్ (నారీశక్తి వందన్ అధినియం) కీలకమైన ముందడుగు అని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
దేశ విభజన అతిపెద్ద విషాదం..
దేశం వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడంలో అన్నదాతల పాత్ర కీలకమని రాష్ట్రపతి కొనియాడారు. వ్యవసాయంలో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు దేశ ప్రజలకు ఆహార కొరతను తీర్చడంలో అన్నదాతల కృషి ఎంతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళిక, సమర్థమైన చర్యల ద్వారా దేశంలో రోడ్లు, రైల్వేలు, పోర్టుల వంటి మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడ్డాయని చెప్పారు. ‘‘బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో పారదర్శకత పెరిగింది. ఆర్థిక వృద్ధి పుంజుకుంది. ఇది భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెడుతుంది.
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుంది” అని ఆమె తెలిపారు. దేశ విభజన అతిపెద్ద మానవ విషాదంగా మిగిలిపోయిందని, ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారని రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘విభజన్ విభిషికా స్మృతి దివస్ (దేశ విభజన భయంకర జ్ఞాపకాల స్మారక దినం)’ను పాటించడం ద్వారా దేశ విభజన నాటి బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఫ్రీడమ్ ఫైటర్లకు కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిద్దామని పిలుపునిచ్చారు.
ఎన్ఈపీతో సత్ఫలితాలు..
నూతన జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలుతో ఇదివరకే సత్ఫలితాలు రావడం ప్రారంభమైందని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. కేంద్ర ప్రభుత్వం యువతకు విద్యతోపాటు నైపుణ్యాలు, ఉద్యోగాలు, ఇతర ఉపాధి అవకాశాలు పెంచేందుకు చర్యలు చేపడుతోందన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో ఇండియన్ అథ్లెట్లు అద్భుతమైన ప్రతిభను చాటారని, టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని క్రికెట్ టీమ్ విజయం సాధించడం దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు.